విశాఖ పోర్టులో డ్రగ్స్: సజ్జలకు అన్నీ అలా ఎలా తెలిసిపోతాయో?

Sajjala Ramakrishna Reddy

వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారు? చేయించారు? అనే ప్రశ్నకు సీబీఐ సమాధానం చెప్పలేకపోవచ్చు కానీ జగన్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని అడిగితే చెపుతారు. అడగకపోయినా చెపుతూనే ఉన్నారు!

అలాగే కోడికత్తి కేసు గురించి కూడా సజ్జలకు తెలుసు. వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలలోకి ఎందుకు వచ్చారు?అంటే సజ్జలకు తెలుసు.

ADVERTISEMENT

తాజాగా ఆయన ఎన్‌సైక్లోపీడియాలో విశాఖ పోర్టులో పట్టుబడ్డ డ్రగ్స్ వివరాలు కూడా రికార్డ్ అయ్యాయి. విశాఖను రాజధాని చేస్తామని నమ్మబలికి గంజాయి రాజధానిగా, ఇప్పుడు మాదక ద్రవ్యాల రాజధానిగా మార్చేశారని టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలపై సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ, “ఆ డ్రగ్స్ కంటెయినర్ టిడిపి, బీజేపీకి చెందినవారే తెప్పించిన్నట్లు మాకు సమాచారం ఉంది.

ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు విశాఖ పోర్టులో తనికీలు చేయడానికి వచ్చినప్పుడు, స్థానిక పోలీసుల సహాయ సహకారాలు తీసుకోవడం సహజం. ఏపీ పోలీసులు వారికి సహకరించడానికే అక్కడకు వెళ్ళారు తప్ప వారిని అడ్డుకోవడానికి కాదు. దీనిపై టిడిపి నేతలు చేస్తున్న వాదనలకు జిల్లా ఎస్పీ సమాధానం చెప్పారు.

బహుశః ఈ మాదక ద్రవ్యాలను ఎన్నికలలో ఉపయోగించేందుకు టిడిపి నేతలే బ్రెజిల్ నుంచి తీసుకువచ్చి ఉండవచ్చని మాకు అనుమానం కలుగుతోంది. కానీ ఆ కంటెయినర్ పట్టుబడిపోవడంతో టిడిపి నేతలు మాపై బురద జల్లి తప్పించుకోవాలని చూస్తున్నారు.

ఎలాగూ ఎన్నికలలో ఓడిపోబోతున్నామని గ్రహించేశారు కనుక ఓడిపోయిన తర్వాత ప్రజలకు చెప్పుకునేందుకు ఏదో ఒకటి ఉండాలి కనుక ఇప్పటి నుండే దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొంటున్నట్లున్నారు. అందుకే ప్రతీరోజూ ఏదో ఒకటి పట్టుకొని ఇలా మాపై బురద జల్లుతున్నారు.

కానీ రాష్ట్రంలో చాలా ప్రశాంతమైన వాతావరణం, సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. సంక్షేమ పధకాలతో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. కనుక టిడిపి నేతలు మాపై ఎన్ని ఆరోపణలు చేసినా ఈసారి ఎన్నికలలో కూడా మళ్ళీ వైసీపి భారీ మెజార్టీతో గెలవబోతోంది,” అని అన్నారు.

వేలకోట్ల విలువగల మాదక ద్రవ్యాలు ఎన్నికలకు ముందు రాజధాని అని గొప్పగా చెప్పుకొంటున్న విశాఖనగరంలోనే పట్టుబడినా, అసలు అదేమీ పెద్ద విషయం కాదన్నట్లు, ఏమీ జరగన్నట్లు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడటం, మా పార్టీయే ఎన్నికలలో గెలుస్తుందని చెప్పుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

అయితే పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు ఏదో పావలా పరకా కావు. వేలకోట్లు ఖర్చు చేసి తెప్పించినవే. కనుక వాటిని ఎవరు, ఎందుకు తెప్పించినా సీబీఐకి భయపడి వదులుకోరు. వాటిని విడిపించుకునేందుకు తెర వెనుక తప్పకుండా ప్రయత్నాలు చేస్తారు. చేస్తే ఆ విషయం సీబీఐ కనిపెట్టకుండా ఉండదు. కానీ కనిపెట్టినా వివేకా హత్య కేసులాగే చేతులు ఎత్తేస్తే ఎవరూ ఏమీ చేయలేరు.

ADVERTISEMENT
Latest Stories