వైఫల్యాలను ఒప్పుకోవడం గొప్ప విషయం. వాటిని చక్కగా సమర్ధించుకోవడం ఇంకా గొప్ప విషయం. ప్రజలు వైసీపికి భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టినప్పటికీ ఈ 5 ఏళ్ళలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. పోలవరానికి ఓ సాకు, అమరావతికి ఓ సాకు, పరిశ్రమలు రాకపోవడానికి మరో సాకు… చివరికి ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దుకి కూడా ఒక్కో సాకు చెపుతూనే ఉంది.
అయినప్పటికీ తమ మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలుచేశామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని, ప్రజలకు చాలా ‘మేలు’ చేశామని నిర్లజ్జగా చెప్పుకుంటున్నారు. మీడియాతో సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పుకున్న ఈ మాటలే ఇందుకు తాజా నిదర్శనాలు.
మీడియాతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల ఏమన్నారంటే…
1. “ప్రత్యేక హోదా, సంపూర్ణ మద్య నిషేధం, సిపిఎస్ రద్దు… ఈ మూడు హామీలు తప్ప 99 శాతం హామీలు అమలుచేశాం. ప్రత్యేక హోదా అంశం మా చేతిలో లేదు. కేంద్రం చేతిలో ఉంది. కనుక ఈ విషయంలో మేము ఏకపాత్రాభినయం చేసినా ప్రయోజనం ఉండదు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో సఖ్యతగా ఉండాలే తప్ప గొడవ పెట్టుకోలేము. అయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నాము.
2. సంపూర్ణ మద్యపానం జగన్మోహన్ రెడ్డిగారి డ్రీమ్. దానిని అమలు చేయాలనే తీసుకున్నాము. కానీ దానిలో అనేక సమస్యలున్నాయి. కనుక మద్యం నియంత్రణకు చర్యలు తీసుకున్నాము.
3. సిపిఎస్ రద్దుని మేము అమలుచేయలేకపోయిన మాట వాస్తవమే. దానిని అమలుచేస్తే మరో పదేళ్ళ తర్వాత ప్రభుత్వంపై చాలా భారం పడుతుందని గ్రహించాము. పదేళ్ళ తర్వాత మనం ఉంటామో ఉండమో తెలీదు కనుక అప్పటి సంగతి మనకెందుకు? అని జగన్ అనుకుని ఉంటే ఓకే అనేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డిగారు చాలా నిబద్దత కలవారు. అలా తప్పుడు వాగ్ధానాలు చేయొద్దని అనుకున్నారు. అందుకే మద్యే మార్గంగా జీపీఎస్ తీసుకువచ్చారు.
ఆనాడు 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ ప్రగల్భాలు పలికారు. ప్రజలు 23 మందిని ఇచ్చారు. కానీ మోడీ ముందు మెడ వంచుకొని ఈవిదంగా చెప్పుకుంటున్నారు. తమ వైఫల్యాన్ని ఈవిదంగా సమర్ధించుకుంటున్నారు.
ఏపీలో సంపూర్ణ మద్య నిషేదం చేయమని ఎవరూ అడగలేదు. మేమే చేస్తామని జగన్ చెప్పుకున్నారు. కానీ భవిష్యత్‌లో జరుగబోయే మద్యం అమ్మకాలను గ్యారెంటీగా చూపి ప్రభుత్వం రుణాలు తీసుకుంది. అంటే ఏపీలో ఎన్నటికీ మద్యానిషేధం జరుగదని జగన్ ప్రభుత్వం స్వయంగా ఆర్ధిక సంస్థలకు గ్యారెంటీ కూడా ఇస్తోందన్న మాట. కానీ సంపూర్ణ మద్య నిషేధం తమ కల అని సజ్జల చెప్పుతున్నారు. ఎందుకంటే కలలు ఎన్నటికీ వాస్తవరూపం దాల్చవు కనుక.
సిపిఎస్ రద్దు గురించి మొదట గట్టిగా వాదించింది… ఉద్యోగుల కోసం మొసలి కన్నీళ్ళు కార్చింది జగన్మోహన్ రెడ్డే. కానీ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు సజ్జల తమ వైఫల్యాలను చక్కగా సమర్ధించుకుంటున్నారు.
సిపిఎస్ వలన పదేళ్ళ తర్వాత ప్రభుత్వంపై పడే భారం గురించి మాట్లాడుతున్న సజ్జలకు మరి సంక్షేమ పధకాల కోసం చేస్తున్న లక్షల కోట్ల అప్పులు, వాటి వడ్డీలు భారంగా కనిపించడం లేదా?
తమ అసమర్దతను, వైఫల్యాలను కూడా ఇంత చక్కగా, ఇంత ధీమాగా కవరింగ్ చేసుకోగల నేర్పు, లౌక్యం ఉంది కనుకనే జగన్మోహన్ రెడ్డి సజ్జలని సలహాదారు కుర్చీలో కూర్చోబెట్టారని అనుకోక తప్పదు.






