ఆరంటే ఆరు నిమిషాల్లో ముగిసే మల్ల యుద్ధంలో కేవలం 8 సెకన్లలోనే మొత్తం సీన్ నే మార్చేశానంటోంది… రియోలో భారత పతకాల ఖాతాను తెరచిన సాక్షి మాలిక్. రియోలో జరిగిన 58 కిలోల మహిళల రెజ్లింగ్ ఫ్రీ స్టెయిల్ పోటీలో తొలి అర్ధభాగం, ఆ తర్వాత కూడా సాక్షి ప్రత్యర్థి ఐసులు టినిబెకోవా దాదాపుగా మ్యాచ్ ను గెలిచేసింది. అయితే మ్యాచ్ చివరి క్షణాల్లో జూలు విదిల్చిన సాక్షి… ఉడుం పట్టు పట్టింది. దీంతో ఐసులు ఆ పట్టు నుంచి లేవలేకపోయింది.
వెరసి సాక్షి విజేతగా నిలిచి రియోలో భారత పతకాల ఖాతాను ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా తాను సాధించిన విజయంపై సాక్షి తనదైన శైలిలో కామెంట్ చేసింది. రెజ్లింగ్ పోటీ కేవలం ఆరు నిమిషాల్లో ముగిసే పోటీనేనని చెప్పిన సాక్షి… ప్రత్యర్థి చేతిలో ఉన్న మ్యాచ్ ను కేవలం 8 సెకన్లలోనే లాగేసుకున్నానని చెప్పింది. తన కోసం ఓ మెడల్ ఎదురు చూస్తోందని చెప్పిన ఈ హర్యానా రెజ్లర్… దానిని ఒడిసిపట్టేయడమే లక్ష్యంగా పోరు సాగించానని చెప్పింది.



