ఏ రంగంలోనైనా శత్రువులు, మిత్రులు తప్పక ఉంటారు. అలాగే ఒకరు ఎదుగుదలను చూసి ఓర్వలేక దెబ్బ తీయాలని చూసేవారూ ఉంటారు. రాజకీయాలలో, సినీ పరిశ్రమలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది. తాజాగా నటుడు సందీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ మెసేజ్ ఇందుకు నిదర్శనం.
“గత కొన్ని రోజులుగా నన్ను, నా సినిమా (సిగ్మా)ని లక్ష్యంగా చేసుకుని చాలా వ్యతిరేక ట్వీట్లు వస్తున్నాయి. వీటి వెనుక ఎవరున్నారో, ఇందుకోసం ఎవరు డబ్బులు చెల్లిస్తున్నారో నాకు పూర్తిగా తెలుసు.
ఒక్క విషయం గుర్తు చేస్తున్నా.. నాకంటే మీరు కోల్పోయేది ఎక్కువ. నేరుగా రంగంలోకి దిగితే అందరి పేర్లు బయటపడతాయి మరి.. చూసుకోండి,” అని ట్వీట్ చేశారు.
ఒక సినిమా బాగుందా లేదా స్థాయి నుంచి ఎవరి సినిమా బాగుంది?ఎందువల్ల బాగుంది? వరకు జరిగే వాదోపవాదాలపై ఎవరికీ ఎటువంటి అభ్యంతరమూ ఉండదు.
కానీ ఆ దశ దాటి ‘మా హీరో చేసిన సినిమా మాత్రమే బాగుంటుంది. మీ హీరో సినిమా చెత్త’ అనే స్థాయికి దిగజారారు. అక్కడితో కూడా ఆగలేదు.
ఓ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి విడుదలయ్యే వరకు ప్రతీ దశలో దానిని దెబ్బ తీయడానికి కుట్రలు, దుష్ప్రచారం జరుగుతూనే ఉన్నాయి.
అయితే దాని వలన మనకి ఒరిగేదేమిటి? అని ఆలోచించి ఉంటే ఎవరూ ఈవిధంగా వ్యవహరించేవారు కారు. కానీ మనకు లాభం ఉన్నా లేకపోయినా ఎదుటవాడి సినిమా చెడగొడితే చాలనుకునే శాడిస్టులు వారి పైశాచికానందం చాలా ఎక్కువైపోయింది.
అసలే సినీ పరిశ్రమ అనేక అంతర్గత సమస్యలతో సతమతమవుతుంటే, డబ్బు ఖర్చు చేసి మరీ సినిమాలను దెబ్బ తీసుకోవడం చాలా బాధాకరం.
ఒక సినిమాని దుష్ప్రచారంతో దెబ్బ తీయగలుగుతున్నప్పుడు, అలాంటి దుష్ప్రచారాలను గుర్తించి అడ్డుకోవడం పెద్ద కష్టం కాదు. సినీ పరిశ్రమలో నెలకొని ఉన్న ఇలాంటి పెడ ధోరణులకు అడ్డుకట్ట వేసేందుకు, వాటిని గుర్తించి వదిలించేందుకు సినీ పెద్దలు పూనుకొని కనీసం చిన్న చిన్న ప్రయత్నాలైనా చేస్తుండాలి. కానీ వేదికలపై నీతి కబుర్లకే పరిమితమవుతున్నారు.
పక్కవాడి ఇంటికి మంటలు అంటుకున్నప్పుడు, నా ఇంటికి అంటుకోలేదు కదా?అనే ధోరణి సినీ పరిశ్రమలో కనిపిస్తోంది.
సినిమాలను దెబ్బ తీసేందుకు జరుగుతున్న దుష్ప్రచారం వలన ఎంత నష్టం జరుగుతుందో, ఇలాంటి మౌనం లేదా అలసత్వం వలన కూడా అంతే నష్టం జరుగుతుంది. కనుక ఇకనైనా సినీ పెద్దలు సందీప్ చెప్తున్న ఇలాంటి సమస్యలపై కూడా దృష్టి సారించాలి.
I see a lot of targeted anti Tweets coming at me & my film over the last few days lol
I know exactly the people behind this & paying for this as well…
Just reminding you that you have more to lose than me..
Direct ayipithe andaru dorikipitharu mari.. choosukondi :)— Sundeep Kishan (@sundeepkishan) October 1, 2026







