2017 సంక్రాంతి పండగ టాలీవుడ్ లో అసలైన సందడిని తీసుకువస్తోంది. చాలా కాలం తర్వాత రెండు పెద్ద సినిమాలు… అవి కూడా బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు తలపడుతుండడంతో… ఆయా హీరోల అభిమానులే కాదు, సినీ అభిమానుల్లోనూ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఈ రెండు సినిమాలతో పాటు ‘శతమానం భవతి’ సినిమా కూడా బరిలో నిలుస్తుందని భావించినప్పటికీ, ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
అయితే తాజాగా సంక్రాంతి బరిలోకి దిగింది బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకునే. ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న తొలి హాలీవుడ్ మూవీ “XXX రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్” సినిమా విడుదల తేదీ వచ్చేసింది. ఫక్తు యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్, టీజర్ లు విడుదలై, ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ చూరగొనడంతో, ఈ సినిమాపై అటు మార్కెట్ వర్గాల్లోనూ, ఇటు సినీ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ నెలకొంది.
సాధారణంగానే “XXX” సినిమా సిరీస్ లకు ఇండియాలో అభిమానులున్నారు. దానికి తోడు దీపికా పదుకునే కూడా తోడవ్వడంతో, తాజా సినిమాపై మార్కెట్ బాగా జరిగింది. ఈ సినిమాను జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నామని అధికారిక ప్రకటన చేయడం, ఒక విధంగా మెగాస్టార్ ‘ఖైదీ’ మాస్ మార్కెట్ ను కొల్లగొట్టడమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగులోకి డబ్బింగ్ అవుతుందా? లేదా? అన్న సమాచారం ప్రస్తుతానికి లేదు గానీ, ఒకవేళ డబ్ అయితే ‘ఖైదీ’పై పెద్ద ప్రభావమే పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
బాలకృష్ణ నటిస్తున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” కధ ప్రత్యేకమైనది కావడంతో… ఈ సినిమా మార్కెట్ వేరు. కానీ, చిరు ‘ఖైదీ’ మాత్రం పక్కా మాస్ మార్కెట్ అన్న విషయం ఇప్పటికే ఖరారైంది. హాలీవుడ్ యాక్షన్ సిరీస్ సినిమాలకు ‘టాక్’తో సంబంధం లేకుండా గుడ్డిగా వెళ్ళిపోయే ప్రేక్షకుల సంఖ్యకు కొదవలేదు. దీనికి తోడు ‘XXX’ గనుక ప్రేక్షకుల ఆదరణ చూరగొంటే, ‘ఖైదీ నంబర్ 150’ కలెక్షన్స్ పై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇదంతా తెలుగులోకి డబ్ అయితేనే సుమీ!



