ఒక సాధారణ కమెడియన్ అయినటువంటి సప్తగిరి సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో ఎందుకు అతిధిగా విచ్చేసారన్న విషయంపై స్పష్టత వచ్చేసింది. అయితే ఎంత ‘టైటిల్’ ఇచ్చినా గానీ, పవన్ స్థాయికి ఆ కృతజ్ఞత చూపించుకునే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో పవన్ కళ్యాణ్ ఒకరు కాబట్టే, కమెడియన్ సప్తగిరి మైక్ పట్టుకున్న మరుక్షణం నేరుగా వెళ్లి పవన్ కళ్యాణ్ కాళ్ళపై పడిపోయాడు.
అవును… ఓ అతి సాధారణ కమెడియన్ సినిమాకు పవన్ అతిధిగా విచ్చేస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో సప్తగిరి చూపించాడు. అంతేకాదు, ప్రతి మెగా అభిమాని ఇష్టపడే విధంగా మాంచి ఏమోషనల్ స్పీచ్ కూడా ఇచ్చాడు. మైక్ పట్టుకుని మాట్లాడుతున్నంత సేపు ఎంతో భావోద్వేగానికి గురైన సప్తగిరి, తన కంట కన్నీరు వచ్చేస్తోంది, అయినా ఆపుకుంటున్నాను… మాటలు రావడం లేదంటూ పవన్ కళ్యాణ్ నే పడేసే విధంగా ప్రసంగించాడు సప్తగిరి.
నాకు మాటలు రావడం లేదు, మొత్తం పవర్ స్టారే ఆవహించేసారు, సినిమాల్లో చూస్తే ఒక కుర్రాడిలా, సడెన్ గా హెల్ప్ చేస్తూ గడ్డం పెంచి మర్యాదస్తుడైన ఒక యోగిలా కనపడతాడు, రాజకీయ వేదికపైన చూస్తే ఒక చరిత్ర సృష్టించే వ్యక్తి మాదిరి ఉంటారని, ఇంతవరకు తానూ చరిత్ర సృష్టించిన వ్యక్తులను చూడలేదని, కానీ పవన్ కళ్యాణ్ రూపంలో భవిష్యత్తులో ఎన్నో సంచలనాలను, విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చే వ్యక్తి మన వెనుక నిలబడ్డాడు…. అంటూ పవర్ స్టార్ ను ఆకాశంలోకి ఎత్తేసారు.
మనసంతా భావోద్వేగంతో నిండిపోయిన ఈ వేళ చెప్తున్నాను… భవిష్యత్తులో మీ కోసం దేనికైనా సిద్ధం… మీ పిలుపు కోసం ఈ అభిమాని ఎదురు చూస్తున్నాడు… అంటూ పరోక్షంగా రాజకీయలకైనా తానూ ‘సై’ అనే సంకేతాలను సప్తగిరి పంపించారు. ఈ స్పీచ్ చూస్తే… పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ నిర్మాత బండ్ల గణేష్ గుర్తుకు రావడం గ్యారెంటీ. ఎందుకంటే బండ్ల గణేష్ ను కూడా మైమరిపించే విధంగా సప్తగిరి ప్రసంగానికి అభిమానులే కాదు, ఏకంగా పవన్ కూడా ఫిదా అయ్యారు.
ఆ తర్వాత మైక్ అందుకున్న పవన్… సహజంగా తనకుండే బిజీ వలన సినిమాలను పెద్దగా చూడనని, కానీ ఈ సినిమా చూడాలని ఉందని, నిర్మాతకు చెప్పి ఒక స్పెషల్ షో వేయించుకుంటానని చెప్పడంతో పవర్ స్టార్ అభిమానులందరి అండదండలను సంపాదించుకోవడంలో సప్తగిరి సక్సెస్ అయ్యారని అర్ధమవుతోంది. ‘సప్తగిరి గారు’ అంటూ సంభోదించిన పవన్ కళ్యాణ్, ‘గబ్బర్ సింగ్’లో నటించిన సప్తగిరిని ఎప్పటినుండో కలుసుకోవాలని అనుకున్నానని, ఈ విధంగా అవకాశం వచ్చిందని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పవన్ చేసిన ప్రసంగం “సప్తగిరి ఎక్స్ ప్రెస్” ఫేట్ మార్చేసేదిలా కనపడుతోంది.



