తమిళ హీరో శింబు పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే సినిమా ‘మన్మధ.’ ముగ్గురు భామలతో శింబు సాగించిన రొమాన్స్ తో పాటు, ఆ సినిమాలోని పాటలు, ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు బాగా నప్పేసాయి. దీంతో తెలుగులో కూడా బీభత్సమైన హిట్ అయ్యింది. ఇక అప్పటి నుండి తెలుగులో తన సినిమాలను డబ్ చేస్తున్నారు గానీ, ఒక్కటి కూడా విజయం సాధించలేదు. కనీసం యావరేజ్ మార్క్ అందుకున్న సినిమాలు కూడా లేవు. దీంతో ఆ ఉధృతికి బ్రేక్ పడినట్లయ్యింది.
కానీ చాలా కాలం తర్వాత మళ్ళీ ‘మన్మధ’ రేంజ్ లోనే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన “సరసుడు” సినిమా ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ కధ ‘మన్మధ’ తరహాలోనే రొమాంటిక్ గా ఉన్నప్పటికీ, అందులో ఉన్న ఏమోషన్ మాత్రం కరువైనట్లుగా స్పష్టంగా కనపడుతోంది.
ఒక్క ఏమోషన్ మాత్రమే కాదు, ‘మన్మధ’ సినిమా సూపర్ హిట్ గా నిలవడానికి, ఆ సినిమాలో వినోదం బాగా పండింది. కానీ ఇందులో వినోదం కాకుండా ప్రేక్షకులకు విసుగు వచ్చేటట్లుగా కనపడుతోంది. మాజీ ప్రియురాలు నయనతార ఉండడమే ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుండగా, ఆండ్రియా ఓ కీలకపాత్రలోనూ, ఆదా ఓ స్పెషల్ సాంగ్ లోనూ మెరవనుంది. ఈ ‘సరసుడు’ గురించి చెప్పడానికి ప్రత్యేకంగా ఏమీ లేదనిపించేలా ట్రైలర్ ను కట్ చేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారని చెప్పవచ్చు.



