శశికళ వర్సెస్ పన్నీర్… క్షణక్షణం… ఉత్కంఠభరితం..!

బుధవారం అర్ధరాత్రి నాడు జరిగిన హైడ్రామాతో తమిళనాట రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అధికారం కోసం పార్టీగా రెండుగా చీలిపోయి శశికళ వర్సెస్ పన్నీర్ గా మారిపోయింది. దీంతో బలాబలాలు లెక్కించుకునే పనిలో రెండు వర్గాలు మునిగితేలుతున్నాయి. తాజాగా శశికళా నటరాజన్ ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి 130 ఎమ్మెల్యేలు హాజరు కావడంతో పన్నీర్ సెల్వం వర్గం షాక్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఇక్కడకు వచ్చిన ఎమ్మెల్యేలలో ఎక్కువ శాతం మంది గోడ మీద పిల్లుల మాదిరి మారిపోయేవారేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

మరోవైపు పన్నీర్ మాత్రం, జయలలిత వారసుడిని తానే అని విధంగా ప్రజల్లో నమ్మకం కలిగించడంలో సక్సెస్ అయ్యారు. జయలలిత సమాధి వద్ద మౌన దీక్ష చేయడం నుండి శశికళ సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యారో అనే విషయం తెలుసుకోవడం వరకు బాగా జాగ్రత్తపడిన పన్నీర్, ఏకంగా జయలలిత మరణాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. అమ్మను చూడడానికి హాస్పిటల్ లో తనకు కూడా శశికళ అనుమతి ఇవ్వలేదని, జయలలిత మరణంపై హైకోర్ట్ జడ్జితో విచారణ జరిపించాలని, అవసరమైతే తన రాజీనామాను వెనక్కి తీసుకునే ఆలోచనలు కూడా ఉన్నట్లు పన్నీర్ సెల్వం సెలవిచ్చారు.

క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగుతున్న తమిళనాట రాజకీయాలు ప్రజలకే కాదు, దేశ రాజకీయ వర్గాలనే ఆకర్షిస్తున్నారు. ఒక అనధికార వెబ్ సైట్ ప్రకారం… ప్రజలంతా పన్నీర్ వైపే ఉండగా, ముఖ్యమంత్రిగా పన్నీర్ కాకపోతే, రాష్ట్రపతి పాలన అయినా విధించండి గానీ, శశికళను మాత్రం జయలలితకు వారసురాలిగా అంగీకరించేది లేదని తేల్చిచెప్తున్నారు. ఈ పోరులో చివరికి ఎవరు విజయం సాధిస్తారో గానీ, సోషల్ మీడియాలో మాత్రం పన్నీర్ సెల్వం ప్రస్తుతానికి హీరో అయిపోయారు.

ADVERTISEMENT
Latest Stories