సమకాలీన రాజకీయ పరిస్థితులను ఒక్కసారి అవగాహనా చేసుకుంటే రాజకీయ పార్టీలు తమ గెలుపు కోసం ప్రజలకు సంక్షేమ పథకాలను ఎరగా వేస్తున్నాయి. అలాగే ప్రజలు కూడా రాజకీయ పార్టీలు ఇస్తున్న ఈ ఉచిత హామీల మోజులో పడి శాశ్వత అభివృద్ధికి కాకా ప్రస్తుత స్వలాభానికి ఆశ పడుతున్నారు.
అయితే ఎన్నికలలో గెలుపుకోసం ముందాలోచన లేకుండా రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాటి అమలుకు భారంగా మారుతున్నాయి. దీని ఫలితంగా ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేయలేక, మాట దాటవేయలేక, అప్పులు చేసి ప్రతిపక్షాల నోటికి చిక్కుతున్నాయి ప్రభుత్వాలు.
Also Read – జగన్ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!
ఈ సమస్య ఒక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి, అలాగే అన్ని ప్రభుత్వాలు కూడా ఈ పథకాల మత్తులో పడి తమ ఆర్థిక భారాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. అయితే ఈ ఉచిత పథకాలు ప్రభుత్వాలకు భారంగా మారితే అవి ప్రజలకు బాదుడుగా మిగులుతున్నాయి.
గత వైసీపీ హయాంలో జగన్ ఇచ్చిన నవరత్నాల అమలుకు ఏకంగా ప్రజల మీద చెత్త పన్ను విధించారు అప్పటి ముఖ్యమంత్రి. అలాగే అమ్మఒడి కోసం నాన్న బుడ్డిని పెంచారు. ఇక కరెంట్ బిల్లుల మీద అదనపు చార్జీల బాదుడు, ఆస్తి పన్ను, ఆదాయపు పన్ను ఇలా కంటికి కనిపించిన అన్నిటి మీద యథేచ్ఛగా పన్నుల భారాన్ని పెంచి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడంతో పాటుగా ప్రజల జీవన ప్రమాణాలను సైతం దిగజార్చారు.
Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!
ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీని గద్దె దింపే నేపథ్యంలో భాగంగా నవరత్నాలకు తోడు సూపర్ సిక్స్ అంటూ మరికొన్ని పథకాలతో ముందుకొచ్చింది. అసలే అప్పులలో, తాకట్లలో ఉన్న ప్రభుత్వ ఖజానా కు ఈ సూపర్ సిక్స్ అమలు తలకు మించిన భారం కాదు ఒక పెద్ద గుదిబండనే చెప్పాలి.
అయితే ప్రభుత్వం ఈ భారాన్ని తిరిగి ప్రజల మీదనే రుద్ది మళ్ళీ వాటిని సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజలకు అందించనుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పటికే కరెంట్ చార్జీల బాదుడు మొదలు పెట్టిన ప్రభుత్వం ఇక రానున్న కాలంలో మరెంత భారం ప్రజల మీద రుద్దనుందో చూడాలి. అలాగే అటు తెలంగాణ ప్రభుత్వం కూడా తమ ఎన్నికల ప్రచారం లో ఎన్నో అమలు సాధ్యం కానీ హామీలిచ్చి ఇప్పుడు అమలు చేయలేక తలలు పట్టుకుంటుంది.
Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్ విశాఖపట్నమే!
అయితే ఈ పథకాలు ప్రభుత్వానికి భారంగా, ప్రజలకు బాదుడుగా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలకు మాత్రం భేరం లా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు మరికొన్ని పథకాలను అదనంగా జోడించి వచ్చే ఎన్నికలలో తమ మేనిఫెస్టో రూపొందించి ప్రజలతో భేరాలు మొదలు పెడతాయి ప్రతిపక్ష పార్టీలు. ఆ తరువాత వారి ప్రభుత్వం కూడా ఈ భారం మోయలేక మోయాల్సి వస్తుంది.
ఇది రాజకీయాలలో ఒక నిరంతర ప్రక్రియ మాదిరి అన్ని రాజకీయ పార్టీలు తమకు అవసరం మేరకు వాటిని వాడుకుంటున్నాయి. ప్రతిపక్షంలో ఉంటే తక్షణమే ఇచ్చిన హామీలు మేలు చేయాలి అంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావడం, అదే ప్రభుత్వంలో ఉంటే అమలుకు ఇంకాస్త సమయం కావాలి అంటూ కాలయాపన చేయడం రాజకీయ పార్టీల రాజకీయంలో ఒక భాగమయిపోయింది. అయితే వీటి భారం మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి సామాన్యుడే మోయాల్సి రావడం ఇక్కడ కోసం మెరుపు.