ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంటిమెంట్ రాజకీయాలు నడిచాయి. అనేకమంది గుండెలు పచ్చి కుండల్లా పగిలిపోయాయి… జగనన్న అప్పుడు వారి కుటుంబాలను ఓదార్చుతూ పనిలోపనిగా వైసీపీని నిర్మించుకొన్నారు. మళ్ళీ ఆ తర్వాత సమైక్య ఉద్యమాలతో కొంత సెంటిమెంట్ పుట్టింది. దానిని అన్ని పార్టీలు వాడేసుకోవాలనుకొన్నాయి కానీ ఏదీ సరిగ్గా వాడుకోలేకపోయింది.
ఆ తర్వాత ప్రత్యేకహోదా సెంటిమెంట్ రగిలింది కానీ అదీ వర్కవుట్ కాలేదు. అప్పటి నుంచి ఏపీలో సరైన సెంటిమెంట్ పడనేలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు బిఆర్ఎస్‌తో ఏపీ సెంటిమెంట్ రాజుకొంటోంది. రాష్ట్ర విభజన చేసిన కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని బిఆర్ఎస్ పార్టీతో ఏపీలో అడుగుపెడతారు? ఏపీ ప్రజలను అనరాని అవమానకరమైన మాటలన్న ఆయనను ప్రజలు ఎందుకు ఆదరించాలి?సాగునీరు, ఆస్తుల పంపకాలు, పోలవరంపై సమాధానం చెప్పి ఏపీలో అడుగుపెట్టాలి,” అంటూ అప్పుడే ప్రశ్నలు, నిరసన స్వరాలు వినబడుతున్నాయి.
Also Read – సెలబ్రెటీలు తస్మాత్ జాగ్రత్త..!
కనుక తెలంగాణలో ఎన్నికలప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగులుతున్నట్లే, బిఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో కూడా ఏపీ సెంటిమెంటు మొదలవుతుందని అర్దం అవుతోంది. అయితే ఈ సెంటిమెంటుతో అధికార, ప్రతిపక్షాలలో దేనికి అనుకూలంగా మారుతుంది?దేనికి ఇబ్బందికరంగా మారుతుందనేది ‘కౌన్ బానేగా కరోడ్ పతీ’లో అడగవలసిన ప్రశ్న.
ఎందుకంటే బిఆర్ఎస్‌ను బూచిగా చూపిస్తూ దానిని ధీటుగా ఎదుర్కోగలిగిన పార్టీకే ఆ సెంటిమెంట్ ఫలిస్తుంది. కానీ ఏపీ రాజకీయ నాయకులందరికీ, ప్రజాప్రతినిధులు, మంత్రులకు కూడా తెలంగాణలో భారీగా ఆస్తులున్నాయి. చాలామంది కుటుంబాలు నేటికీ అక్కడే ఉన్నాయి. కనుక బిఆర్ఎస్‌ను బూచిగా చూపించి పైచేయి సాధించాలని ప్రయత్నిస్తే అక్కడ తెలంగాణలో ఇబ్బందులు మొదలైపోతాయి. అలాగని రాష్ట్రాన్ని ముక్కలు చేసిన బిఆర్ఎస్‌తో చేతులు కలిపితే ఇంకా ప్రమాదం. కానీ ఒక్కమాట మాత్రం నిజం. బిఆర్ఎస్ ఏపీలోకి ప్రవేశిస్తే రాష్ట్రంలో కూడా ఆంధ్రా సెంటిమెంట్ మొదలవుతుంది. అప్పుడు మూడు ప్రధానపార్టీలు ఆ సెంటిమెంటును ఏవిదంగా ఉపయోగించుకొంటాయి?అసలు ఉపయోగించుకోగలవా లేదా? అనేది రాబోయే రోజుల్లో స్పష్టం అవుతుంది.