అయితే వైఎస్ షర్మిల ఏపీకి వచ్చేస్తునట్లేనా?

YS Sharmilaవైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయబోతున్నట్లు ఆ మద్యన వార్తలు వస్తే, ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. కాంగ్రెస్‌తో కనీసం పొత్తులు కూడా తనకు అవసరం లేదన్నట్లు మాట్లాడారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాదలిస్తే మాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడ తెలంగాణలో కాదు… ఏపీ కాంగ్రెస్‌లో విలీనం చేసుకోమని” ఉచిత సలహా ఇచ్చారు. “అక్కడైతే నేను కూడా స్వాగతిస్తాను… సహకరిస్తానని” రేవంత్‌ రెడ్డి చెప్పారు.

ADVERTISEMENT

ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రసక్తే లేదనప్పుడు రేవంత్‌ రెడ్డి ఆవిదంగా మాట్లాడవలసిన అవసరమే లేదు కానీ అన్నారంటే ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారనే విషయం ఆయనకు ఖచ్చితంగా తెలుసని భావించవచ్చు.

ఈ వార్తలు, ఊహాగానాలు, రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు అన్నీ నిజమేనని ధృకరిస్తున్నట్లు, ఈరోజు ఆమె రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతూ ట్వీట్‌ చేశారు. అధికార, ప్రతిపక్షాల నేతలు ఎంత బద్దవిరోద్ధులైనప్పటికీ ఇటువంటి సందర్భాలలో శుభాకాంక్షలు చెప్పుకొంటూనే ఉన్నారు. కనుక వైఎస్ షర్మిల కూడా అదే చేశారని సరిపెట్టుకోవచ్చు. అయితే ఆమె రాహుల్ గాంధీలో గొప్ప గుణాలను, దేశాన్ని జోడించేందుకు ఆయన చేస్తున్న కృషిని కూడా అభినందిస్తూ మరో రెండు ముక్కలు అదనంగా మెచ్చుకొన్నారు.

దీంతో మళ్ళీ వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయబోతున్నట్లు ఊహాగానాలు మొదలైపోతాయని ఆమెకు తెలుసు. అయినా ఆమె ‘రాహుల్ గాంధీ భాషలో శృతి కలుపుతూ’ శుభాకాంక్షలు తెలిపారు కనుక కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ఆమె సిద్దంగానే ఉన్నట్లుగానే భావించవచ్చు.

ఏపీ కాంగ్రెస్‌ రాష్ట్ర విభజనతో కొంత, జగన్మోహన్ రెడ్డి కారణంగా పూర్తిగా నష్టపోయిన సంగతి తెలిసిందే. కనుక ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు ఏపీలో వైసీపీ ధాటిని తట్టుకొంటూ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీవం పోసి పునర్జన్మ ప్రసాదించాలంటే, వైఎస్ఆర్ కుటుంబానికే చెందిన వైఎస్ షర్మిల సరైన వ్యక్తి అని కాంగ్రెస్‌ అధిష్టానం భావించడం సహజమే. అందుకు ఆమె ఒప్పుకొని ఉంటే అదీ సహజమే.

ఎందుకంటే, జగనన్న జైల్లో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల నిలబడి వైసీపీని కాపాడుకోకపోయుంటే, వైసీపీ కూడా కాంగ్రెస్ పార్టీలాగే కనబడకుండా పోయేది. వైసీపీని కాపాడుకోవడం కోసం ఆమె ఎంతగానో శ్రమిస్తే, జగనన్న అధికారంలోకి వచ్చాక చెల్లెమ్మను పులిహోరలో కరివేపాకులా తీసి పక్కన పడేసారు. ఆ తర్వాత విజయమ్మను సగౌరవంగా బయటకు సాగనంపారు.

అందుకు వైఎస్ షర్మిల కూడా రగిలిపోతూనే ఉన్నారు. కనుక ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బలమైన కారణమే ఉందని చెప్పవచ్చు. ఆమె ఏపీ కాంగ్రెస్‌లో చేరినట్లయితే ఒకప్పుడు జగనన్న సంధించిన బాణమే వెనక్కు తిరిగివచ్చి ఆయనకే గుచ్చుకోబోతోంది.

ఇక వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీతో ఏపీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయాలలో మరింత పతనం కావచ్చు. వచ్చే ఎన్నికలలో ఏపీలో ఓట్లు అన్ని పార్టీల మద్య చీలిపోవడం, ఆ కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరోసారి రాజకీయ ప్రయోగశాలగా మరే ప్రమాదం కూడా కనిపిస్తోయింది. ఆమెను ఏవిదంగా ఎదుర్కోవాలో టిడిపి, జనసేన, బిజెపిలకు స్పష్టత ఉంది. వైసీపీయే ఆలోచించుకోవలసి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories