కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో, నాలుగు భాషలలో తెరకెక్కుతోన్న “సంఘమిత్ర” ప్రాజెక్ట్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతిహాసన్ టైటిల్ రోల్ లో కనిపించిన ఈ పోస్టర్, మరికొన్ని రోజులకే పనికి రాకుండా పోయింది. ఎందుకంటే… ఈ ప్రాజెక్ట్ లో శృతిహాసన్ లేదని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత శృతి కూడా ఈ విషయాన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేసింది.
అయితే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి గల కారణాలను వివరిస్తూ… ‘సంఘమిత్ర’ చిత్ర యూనిట్ తనకు బౌండ్ స్క్రిప్టు ఇవ్వలేదని, అలాగే ఎన్ని రోజుల షెడ్యూల్స్ కావాలో కూడా చెప్పలేదని, ఇలా అయితే ముందుకు వెళ్ళడం అసాధ్యం గనుక తప్పుకోవడమే మంచిదని ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగినట్లుగా తెలిపింది. అయితే దీనికి కౌంటర్ గా తాజాగా చిత్ర నిర్మాతస్పందించారు. శృతిహాసన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఆమె తనంతట తానుగా తప్పుకోలేదని, ఈ ప్రాజెక్ట్ నుండి తామే తప్పించామని చిత్ర నిర్మాత హేమరుక్మిణి తెలిపారు.
భారీ బడ్జెట్ సినిమా అనగానే భారీ పారితోషికం అడిగిందని, అలాగే విదేశాల్లో గుర్రపు స్వారీ నేర్చుకుంటానని చెప్పడంతో దానికి కూడా సరేనని భారీ మొత్తం ఇచ్చామని, అయితే ఈ విషయాలు కాకుండా శృతిహాసన్ వ్యవహారశైలి భరించలేని విధంగా తయారైందని, అందుకే ఈ ప్రతిష్ఠాత్మక సినిమా నుంచి తప్పించామని స్పష్టత ఇచ్చారు. దీంతో శృతి – చిత్ర యూనిట్ నడుమ మధ్య ‘ఈగో’ యుద్ధం ప్రారంభమైందని, శృతి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ‘సంఘమిత్ర’ నిర్మాతలు ఈ వ్యాఖ్యలు చేసారని కోలీవుడ్ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.



