రాజ్యాంగ నియమాలు, ప్రభుత్వ ఆదేశాలు, అధికారుల సూచనలు, న్యాయస్థానాల తీర్పులు అన్ని సామాన్యుడికైనా.? అవి రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, వ్యవస్థలకు, సెలబ్రెటీలకు పట్టవా అనేది ప్రతి సామాన్యుడి ఆవేదన.
అయితే ఇదే ఆవేదనను ఆక్రోశంగా మార్చి రోడ్డు మీద నిరశన చేపట్టాడు ఒక సామాన్యుడు. మేము రోడ్ల పైకి వస్తే లైసెన్సు ఉందా.? ఆర్సీ ఉందా.? హెల్మట్ లేదా.? పొల్యూషన్ సర్టిఫికెట్ చూపించు అంటూ నానా రకాల ప్రశ్నలు వేస్తూ వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా మా పొరపాట్లకు ఫైన్ లను విధిస్తు మా జేబులు కాలిచేస్తున్నారు.
సామాన్యుడి పట్ల ఇన్ని నియమాలను సక్రమంగా అమలు చేయగలుగుతున్న వ్యవస్థలు మరి అదే సామాన్యుడు కట్టే ప్రభుత్వ పన్నుకి సానుకూలమైన వసతులు అందుబాటులో ఉంచలేరా.? మరి మీ అలసత్వానికి మీరు ఎవరికీ జరిమానా కడుతున్నట్టు.? అంటూ ఒక సామాన్య పౌరుడు రోడ్డు మీద నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అలాగే అతడిని నిరశన పై నెటిజన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు వెల్లువెత్తుతోంది. అసలు విషయానికొస్తే..,కరీంనగర్ – జగిత్యాల జాతీయ రహదారి గుంతలతో అద్వానంగా మారండంతో శ్యామ్ కుమార్ అనే ఒక సాధారణ వ్యక్తి రోడ్డు మీద బైఠాయించి అధికారులను, ప్రభుత్వ వ్యవస్థలను ప్రశ్నిస్తున్నారు.
పోలీస్ కమిషనర్, కలెక్టర్ లు రోడ్డు పై వాహనాలు నడిపే వ్యక్తి ఏది ధరించకపోయినా, అధికారులు అడిగిన ఏ కాగితం చూపించకపోయినా మాకు ఫైన్లు వేస్తున్నారు, మరి మా వాహనాలు సాఫీగా వెళ్లేందుకు ఇక్కడ అసలు రోడ్లే సరిగా లేవు, దానికి గాను మరి మీరు నాకెంత ఫైన్ చెల్లిస్తారు.? అంటూ అధికారులను తన పదునైన ప్రశ్నలతో ఇరుకునపెట్టారు.
తలకు హెల్మెట్, చేతిలో ప్లకార్డు పట్టుకుని, తన స్కూటీ తో సహా గుంతలు పడ్డ రోడ్డు మీదే నిరశన కు దిగాడు శ్యామ్ కుమార్. అయితే అధికారులను, వ్యవస్థలను ఉద్దేశించి శ్యామ్ సంధించిన ప్రశ్నలు న్యాయబద్దమైనవే అంటూ శ్యామ్ నిరశనపై మద్దతు పెరుగుతుంది.
సామాన్యుడి పట్ల బలంగా పనిచేసే వ్యవ్యస్థలు అంతే బలంగా సామాన్యుడి నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలిగా.? రూల్స్ గురించి మాట్లాడుతున్న అధికారులు బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాలిగా.?
సామాన్యుడి పొరపాట్లకు జరిమానాలు విధించే అధికారులు వ్యవస్థల తప్పిదాలకు కూడా పరిహారాలు చెల్లించాలిగా.? సామాన్యుడికి జరిమానాలు, వ్యవస్థలకు వెసులుబాట్లా.? అంటూ శ్యామ్ నిరశన చుట్టూ ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు చక్కరలు కొడుతున్నాయి.





