రాను రాను టాలీవుడ్ శుక్రవారాలు కాయగూరల మార్కెట్ ని తలపిస్తున్నాయి. ఒకపక్క థియేటర్లు కనీసం సగమైనా నిండక జీతాలు ఇవ్వడమే కష్టమైపోయిందని ఎగ్జిబిటర్లు మొత్తుకుంటున్నారు. గత మూడు నాలుగు నెలల్లో విరూపాక్ష, దసరా, బలగం, బిచ్చగాడు 2 మాత్రమే కడుపు నిండేలా అన్ని చోట్ల వసూళ్లు తీసుకొచ్చాయి.
మేం ఫేమస్ లాంటివి హిట్టనిపించుకున్నా అన్ని కేంద్రాల్లో యునానిమస్ రెస్పాన్స్ తెచ్చుకున్నవి కావు. ఇక ఏజెంట్, శాకుంతలం, కస్టడీ చేసిన గాయాల గురించి మళ్ళీ గుర్తు చేసుకోకపోవడం ఉత్తమం. ఈ శుక్రవారం హోల్ సేల్ గా చిన్న సినిమాలు దాడి చేయబోతున్నాయి. సిద్దార్థ్ ‘టక్కర్’ ప్రమోషన్లు గట్టిగానే చేస్తున్నారు కానీ తమిళ వాసన గుప్పుమంటున్న ఈ యాక్షన్ డ్రామాకు టాక్ చాలా కీలకం.
సముతిరఖని, అనసూయలు ప్రధాన పాత్ర పోషించిన ‘విమానం’కు ఏదో అత్యద్భుతమైన టాక్ వస్తే తప్ప ఓపెనింగ్స్ కూడా ఉండవు. నెలలలు తరబడి వాయిదా వేస్తూ వచ్చిన ‘ఇంటింటి రామాయణం’ హఠాత్తుగా దిగుతోంది. ముందు ఓటిటికి అనుకుని తెలంగాణ సెంటిమెంట్ ఉందనే కారణంతో ఆహా టీమ్ థియేటర్లకు షిఫ్ట్ చేశారు.
‘అన్ స్టాపబుల్’ అంటూ బాలయ్య టాక్ షో పేరుని టైటిల్ గా పెట్టుకున్న దర్శకుడు డైమండ్ రత్నబాబు పెద్ద సాహసమే చేశాడు. బిగ్ బాస్ సన్నీ, సప్తగిరిలను చూసేందుకు జనం అంత సులభంగా రారు. పట్టువదలని విక్రమార్కుడిలా సామజిక సమస్యల మీద సినిమాలు తీస్తూనే ఉన్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ‘యునివర్సిటీ’ కూడా నేను సైతం అంటూ రంగంలోకి దిగుతోంది.
ఒకప్పుడు ఎర్రసైన్యం లాంటి బ్లాక్ బస్టర్లు చూసిన మూర్తిగాగారు ఇప్పటి జనరేషన్ కు కూడా ఏదో సందేశం ఇవ్వాలని తాపత్రయపడుతూనే ఉన్నారు. వీటిలో దేనికీ ఫస్ట్ డే మార్నింగ్ షోలకు థియేటర్ అద్దె గిట్టుబాటు అయ్యేంత కలెక్షన్ రాదు. ఖచ్చితంగా టాక్ మీద ఆధారపడి ఎదురు చూడాల్సిందే. హాలీవుడ్ మూవీ ‘ట్రాన్స్ ఫార్మర్స్’ మీద ఉన్నంత క్రేజ్ లో సగం కూడా వీటికి లేదు.
అసలే వారం గ్యాప్ లో ఆదిపురుష్ వచ్చేస్తుంది. అత్యధిక స్క్రీన్లలో ప్రభాస్ తప్ప ఇంకొకరు కనిపించరు. అలాంటప్పుడు కేవలం ఏడు రోజులు సరిపోతాయని ఇన్నేసి సినిమాలు జూన్ 9కి రిస్క్ చేయడం విచిత్రం. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అనే సామెత ఎన్నేళ్ళైనా టాలీవుడ్ కు వర్తిస్తూనే ఉంటుంది.



