
‘పోరాట యాత్ర’ పేరుతో జనసేన అధినేత చేస్తోన్న విమర్శల వర్షం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో సాగిన పవన్ యాత్రకు పదే పదే బ్రేకులు పడుతుండడంతో అభిమానులు కాస్త నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పొంతన లేని కారణాలతో విరామాలను ప్రకటించడంతో… సోషల్ మీడియా వర్గాలకు జనసేన టార్గెట్ అవ్వక తప్పలేదు.
“ఇది పోరాట యాత్ర కాదు, విరామాల యాత్ర, మధ్య మధ్యలో పోరాట యాత్ర చేస్తారు” అంటూ నెటిజన్లు చేస్తోన్న విమర్శలు కోకొల్లలు. 16వ తేదీన రాబోయే రంజాన్ ను పురస్కరించుకుని ఒక వారం రోజులు ముందుగానే యాత్రకు బ్రేక్ చెప్పడంతో ‘జనసేన అధినేత’ ప్రణాళిక మరోసారి విమర్శలకు దారితీసింది. రెండు రోజుల పాటు విశాఖలో మేధావులతో చర్చ అనంతరం మంగళవారం నాడు పవన్ హైదరాబాద్ కు చేరుకుంటారని మీడియా హెడ్ హరి ప్రసాద్ స్పష్టం చేసారు.
అయితే ఇటీవల ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీయడంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఫ్రెష్ గా ప్రారంభించడం మేలన్న ఆలోచనలో ఈ యాత్రకు బ్రేక్ ఇచ్చినట్లుగా పొలిటికల్ వర్గాలలో ఉన్న టాక్. అవగాహన లేకుండా విమర్శలు చేయడం కంటే, సరిగ్గా అధ్యాయనం చేసి మాట్లాడితేనే ప్రజలకు చేరువ అవుతామని జనసేన అధినేత గ్రహించినట్లున్నారు!



