ఎవరికి ,ఎప్పుడు, ఎలా, ఏ అదృష్టం ఏ రూపంలో వరిస్తుందో ఎవరికీ తెలియదు. కొన్ని కొన్ని ఊహించనివి జరిగితే, ఇంకొన్ని మాత్రం ఊహించినవి జరుగుతాయి. ఓ బ్యూరో క్రాట్ కి, ఓ నాయకుడికి సరిగ్గా జోడి కుదిరితే ఇక ఆ కాంబినేషన్ సృష్టించే అద్భుతాలే వేరు. సరిగ్గా అలా ఏర్పడిన కాంబినేషన్ పాలనలో తీసుకువచ్చే మార్పులు అన్ని ఇన్ని కాదు. తాజాగా ఆ ఐఏఎస్ అధికారి కూడా బలమైన నేతగా మారిపోయారు. ఇంతకీ అసలు సంగతేందో చూద్దాం పదండి.
సోమేశ్ కుమార్ ఐఏఎస్ , తెలంగాణ రాష్ట్రంలో ఈ పేరుకు చాలా పలుకుబడి ఉంది. కేవలం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఉన్నతాధికారిగా మాత్రమే కాకుండా కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైన, ఇష్టమైన ఐఎఎస్ అధికారిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
1989 బ్యాచ్ కి చెందిన సోమేశ్ కుమార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా బాధ్యతలు చేపట్టారు. జీ.హెచ్.యం.సి కమీషనర్ గా ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ లో సోమేశ్ కుమార్ దే రికార్డ్ అని చెప్తారు. 2019 డిసెంబర్ మాసంలో ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
సోమేష్ కుమార్ పోస్టింగ్ కూడా ఓ సంచలంగా మారిన పరిస్థితి. రాష్ట్ర విభజన సమయంలో తనకున్న సీనియారిటీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. అయితే సోమేశ్ కుమార్ ఆ నియామకాన్ని సవాలు చేస్తూ క్యాట్ ని ఆశ్రయించారు. క్యాట్ ఆయనకు తెలంగాణ లో కొనసాగేవిధంగా తీర్పు ఇచ్చింది. దాంతో ఆయన తెలంగాణ లో కొనసాగారు.
అయితే క్యాట్ ఇచ్చిన తీర్పుని రద్దుచేయాల్సిందిగా డిఓపిటి రిట్ దాఖలు చేసింది. దీంతో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ కి వెళ్లాలని తెలంగాణ హైకోర్ట్ ఉత్తర్వులు జారీచేసింది. ఇక చేసేది లేక ఆయన ఏపీ లో రిపోర్ట్ చేశారు. కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషించినట్లే ఆయన తన ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ చేయడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేసింది.
అయితే ప్రముఖ రాజకీయ విశ్లేషకులలో ఒకరైన కే.ఎస్. ప్రసాద్ తన విశ్లేషణలలో తరచూ సోమేశ్ కుమార్ స్వచ్చంద విరమణ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా నియమితులవుతారని ఆయన ముందే ఊహించి చెప్పారు. తాజాగా కే.ఎస్.ప్రసాద్ చెప్పిన మాటలు అక్షరాల తూచా తప్పకుండా అదే జరిగిందని ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది.
తాజాగా గతంలో జరిగిన విశ్లేషణలను నిజం చేస్తూ తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహదారుడుగా నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది.
ఇప్పటివరకు సి.ఎస్ హోదాలో కేసీఆర్ తో కలసి పనిచేసిన సోమేశ్ కుమార్, ఇప్పటి నుండి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా పనిచేస్తారని, బిఆర్ఎస్ పార్టీ వ్యవహారాల్లో, తెలంగాణ రాష్ట్ర పాలనాపరమైన అంశాల్లో అనుసరించాల్సిన విధానాలలో ఆయన మేధస్సుని ఉపయోగించి గణనీయమైన మార్పులు తీసుకొస్తారని, కేసీఆర్ కి కుడిభుజంగా వ్యవహరిస్తారని అటు అధికారుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది.



