క్రికెట్ : శ్రీలంకకు షాక్ ఇచ్చిన జింబాబ్వే!

Sri Lanka v Zimbabwe - ODI seriesక్రికెట్ లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఒత్తిడిని అధిగమించలేని పాకిస్తాన్ జట్టు ఫైనల్లో ఏకంగా టీమిండియా పైన విజయం సాధించవచ్చు. అలాగే పసికూనలుగా ఉన్న జింబాబ్వే జట్టు, టాప్ టీంలలో ఒకటైన శ్రీలంకను మట్టి కరిపించవచ్చు. ప్రస్తుతం రెండవదే జరిగింది. కొట్టడం అంటే అలా ఇలా కాదండోయ్… ఏకంగా 317 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టుకు దిమ్మ తిరిగే విధంగా కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించేసింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 316 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. ఓపెనర్ గుణతిలక 60, వన్ డౌన్ లో మెండిస్ 86, మిడిల్ ఆర్డర్ లో తరంగ 79, మాథ్యూస్ 43, చివర్లో గుణరత్నె 28 పరుగులతో రాణించడంతో శ్రీలంక భారీ స్కోర్ ను నమోదు చేసింది. అయితే బంగ్లాదేశ్ చేతిలోనే ఓటమి పాలైన జింబాబ్వే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందని, బహుశా ఆ టీం కూడా ఊహించి ఉండకపోవచ్చు.

ADVERTISEMENT

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు 10.2 ఓవర్లకే 2 ప్రధాన వికెట్లు కోల్పోయి కేవలం 46 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ తరుణంలో ఓపెనర్ మిరే అద్భుతమైన బ్యాటింగ్ తో శ్రీలంక బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన మిరే, 96 బంతుల్లో 14 ఫోర్లతో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. మిరేకు చక్కటి సహకారం అందించిన విలియమ్స్ 69 బంతుల్లో 65 పరుగులు చేసిన 4వ వికెట్ గా వెనుదిరిగాడు.

అయితే అప్పటికి విజయానికి మరో 97 కావాల్సి ఉండగా, ఆ కార్యాన్ని సికందర్ రాజా (67), మల్కలం వాలేర్ (40)లు విజయవంతంగా పూర్తి చేసారు. వీరిద్దరి సమయస్పూర్తి బ్యాటింగ్ ప్రతిభతో తొలి వన్డేలోనే అవాక్కవ్వడం శ్రీలంక వంతయ్యింది. దీంతో అయిదు వన్డేల సిరీస్ లో 1-0తో లీడ్ లో ఉంది ఆతిధ్య జట్టు. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ వీరుడు మిరేకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

ADVERTISEMENT
Latest Stories