మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంభినేషన్ లో సినిమా ప్రకటించి తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి సృష్టించిన సంచలనం తెలిసిందే. అయితే చిరు, పవన్ లకున్న కమిట్మెంట్స్ రీత్యా, ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదని, కేవలం పేపర్ ప్రకటనకే పరిమితం అవుతుందని, ఏకంగా సినీ జనాలే బహిరంగంగా వ్యాఖ్యానించుకోవడంతో, సుబ్బిరామిరెడ్డి మళ్ళీ తెరపైకి రావాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఏది ఏమైనా ఈ కాంభినేషన్ లో సినిమా నిర్మించి తీరుతానని చెప్తున్న తిక్కవరపు ఏం చెప్పారో పరిశీలిస్తే…
తాను గతంలో చిరంజీవితో పలు సినిమాలు నిర్మించానని, అలాగే రజనీకాంత్, శోభన్ బాబులతో కూడా మల్టీ స్టారర్ సినిమాను తీశానని గుర్తు చేసిన సుబ్బిరామిరెడ్డి, ఖచ్చితంగా చిరంజీవి – పవన్ కళ్యాణ్ ల కాంభినేషన్‌లో నిర్మించి తీరుతానని అన్నారు. పవన్ కళ్యాణ్ కు అన్నయ్యంటే ఎంతో ప్రేమ అని, అలాగే చిరుకి కూడా పవన్ అంటే ఎంతో ఇష్టమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే వీరిద్దరూ పలు సినిమాలు ఒప్పుకున్నారని, ఇక వారిద్దరి కాంబినేషన్‌లో సినిమా తీయడానికి సమయం ఎక్కడుందని కొందరు అంటున్నారని, అయితే తాను కచ్చితంగా వారితో సినిమా తీస్తానని చెప్పారు.
చిరు, పవన్ లు తనకు మంచి స్నేహితులేనని, అలాగే త్రివిక్రమ్, పవన్, చిరు, ముగ్గురూ ఎల్లప్పుడూ బిజీగానే ఉంటారని, అయినప్పటికీ తాను సినిమా తీస్తానని చెబితే ఒప్పుకున్నారని అన్నారు. అయితే ఈ సినిమా కథ ఎలా ఉంటుందని విలేకరులు ప్రశ్నించగా… వృక్షం రావాలంటే విత్తనం వేయాలని, ఆ విత్తనం తాను వేశానని అంటూ… కథ గురించి ఎటువంటి క్లూ ఇవ్వలేదు. ఈ కాంభినేషన్ లో సినిమాకు, రాజకీయాలకు అస్సలు సంబంధం లేదని ఈ సందర్భంగా స్పష్టత ఇచ్చారు.



