ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో నిర్మిస్తున్న భవనం పూర్తయ్యే వరకు హైదరాబాద్ నుంచి హైకోర్టు తరలింపు నిర్ణయం వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే అత్యవసర విచారణ చేపట్టాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జనవరి 2న సాధారణ విచారణ చేపడతామని స్పష్టంచేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ ఈ పిటిషన్‌ను విచారణ స్వీకరించినప్పటికీ.. అత్యవసర విచారణను చేపట్టలేమని స్పష్టంచేశారు.
[m9ad]
సుప్రీం కోర్టుకు శీతకాల సమావేశాలు కొనసాగుతున్నందున జనవరి రెండున కోర్టు ప్రారంభమైన రోజు సాధారణ విచారణ చేపడతామని తెలిపారు. దీనితో జనవరి 1న విభజన జరిగిపోనుంది. జనవరి 2వ తేదీన చేపట్టే విచారణ వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని తెలుస్తుంది. హైకోర్టు భవనాలు, జడ్జిల నివాస సముదాయాలు, ఇతర మౌలిక వసుతులు పూర్తయ్యే వరకు హైకోర్టు విభజన వాయిదా వేయాలని కూడా న్యాయవాదుల సంఘం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.
హైకోర్టు విభజన అవసరమేనంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ఈ రోజే (సోమవారమే) ఆఖరి రోజు. మంగళవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హై కోర్టు విభజన పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల విభజన దాదాపుగా పూర్తయ్యినట్టే. అమరావతిలోని టెంపరరీ హై కోర్టు భవనాలు పూర్తయ్యే వరకు విజయవాడలోని సీఎం క్యాంపు ఆఫీసులో హై కోర్టు కొలువుదీరనుంది.
ఏపీకి సిబ్బందిని, లాయర్లను తరలించేందుకు అమరావతి నుంచి ప్రత్యేక బస్సులను పంపించారు. ఈరోజు సాయంత్రం ఏపీ చేరుకోనున్న న్యాయమూర్తులకు విజయవాడలోని ఓ హోటల్లో బస ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం అమరావతిలో ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చే ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం జడ్జిలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక విందు ఇవ్వబోతుంది.



