వర్మ ఇప్పటికి ‘స్వామి భక్తి’ ప్రదర్శిస్తున్నారే….

SVSN Varma Reaffirms Loyalty to TDP Amid Exit Rumours

పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే S.V.S.N వర్మ 2024 ఎన్నికల తరువాత నిత్యం వార్తలలో నిలిచిన నేతగా రాష్ట్ర వ్యాప్త గుర్తింపు పొందారు. అయితే కూటమి పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసి టీడీపీ నేతగా మొదట గుర్తింపు, గౌరవం పొందిన వర్మ అటు పిమ్మట పిఠాపురంలో ఇరు పార్టీల ఆధిపత్య రాజకీయ పోరుతో వివాదాలు ఎదుర్కొన్నారు.

పిఠాపురంలో జనసేన ఎదుగుదలకు వర్మ అడ్డుపడుతున్నారని జనసేన, నిన్నకాక మొన్నవచ్చిన వారు తనను, తన పార్టీని నియోజకర్గానికి దూరం చేస్తున్నారని వర్మ ఇలా టీడీపీ vs జనసేన అన్నట్టుగా రాజకీయం మారిపోవడంతో టీడీపీ అధిష్టానం మిత్ర ధర్మానికి కట్టుబడి వర్మను పిఠాపురం పార్టీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది.

ADVERTISEMENT

దీనితో వర్మ చేసేదేమి లేక పార్టీ అధిష్టాన నిర్ణయానికి తలవంచి తన బాధ్యతలను వదులుకున్నప్పటికీ అధిష్టాన నిర్ణయం పై అసంతృప్తితో రగిలిపోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఇక రేపోమాపో వర్మ టీడీపీ జెండాకు గుడ్ బై చెప్పి వైసీపీ జెండా పట్టుకోవడం ఖాయం అనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి.

దీనికి తోడు వర్మ కూడా క్షేత్ర స్థాయి రాజకీయాలలో ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడంతో ఈ ప్రచారాలు వాస్తవరూపం దాల్చడం ఖాయమనే గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యలు ఆయన అనుచరులను, టీడీపీ శ్రేణులను కూడా ఆశ్చర్యానికి గురి చేసాయి.

ముద్రగడ సంతాప సభ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇస్తూ టీడీపీ కి మద్దతుగా మాట్లాడారు. నాడు ముద్రగడ కాపు ఉద్యమం 2019 టీడీపీ ఓటమికి కారణంగా నిలిచింది అన్న బోండా వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

ఉమా తన వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, అలా చెయ్యొద్దని, 2014 ఎన్నికలకు ముందే పిఠాపురంలో బాబు కాపులను బీసీ లలో చేరుస్తానని హామీ ఇచ్చారని, కానీ వైసీపీ అధికారంలో ఉన్నా ఐదేళ్లు కాపు సామాజికవరాగ్నికి చేసింది శున్యమంటూ పార్టీ పై తనకున్న చిత్తశుద్ధిని, పార్టీ అధిష్టానం పై తనకున్న స్వామి భక్తిని మరోమారు బయటపెట్టారు.

దీనితో వర్మ బాబు విధేయుడని, టీడీపీ సైనికుడంటూ టీడీపీ శ్రేణులు వర్మ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. బోండా ఉమా వ్యాఖ్యల పట్ల పార్టీ కోసం స్టాండ్ తీసుకున్న మొదటి నేతగా వర్మ నిలవడం ఆయనకు టీడీపీ పై ఉన్న అపారమైన ప్రేమకు, గౌరవానికి నిదర్శనంటున్నారు వర్మ అనుచరులు.

ADVERTISEMENT
Latest Stories