మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 2న విడుదలకు సిద్ధం అవుతుంది.
విడుదల దగ్గర పడుతున్న కొద్దీ హైప్ పెంచే క్రమంలో చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల చేశారు. చిత్రంలోని యాక్షన్ పార్టుని హైలైట్ చెయ్యడానికే ఇది విడుదల చేసినట్టుగా కనిపిస్తుంది. ట్రైలర్ ను బట్టి ఫైట్స్ అదిరిపోయాయి అని చెప్పవచ్చు. రామ్ చరణ్ ఎక్కడా కంప్రమైజ్ కాకుండా సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది.
గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు… ఈ గడ్డ మీద పుట్టిన ప్రతీ ప్రాణానికి లక్ష్యం ఒక్కటే.. స్వాతంత్రం వంటి డైలాగులు పేలాయి. వాటికి ఎమోషన్ కూడా తోడైతే బాగా హైలైట్ అవుతాయి. మొదటి నుండీ అనుకుంటున్నట్టుగా చిరంజీవి గెట్ అప్, భారీ డైలాగులు చెప్పేటప్పుడు డైలాగ్ డెలివరీ ఎలా కుదురుతాయి అనేది మాత్రం చూడాల్సి ఉంది.
అయితే ఫ్యాన్స్ కు మాత్రం ట్రైలర్ లోని ఫైట్స్, గ్రాండ్యుర్ తోనే కిక్ ఎక్కేసింది. దీనితో చిత్రానికి భారీ ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ షోల కోసం పర్మిషన్ పెట్టుకున్నారు. మొదటి వారం రేట్లు పెంచేందుకు కూడా సన్నాహాలు మొదలు పెట్టారు. ఇప్పటికే కొన్ని థియేటర్లు పెంచిన రేట్లతో బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నాయి.



