‘లోకనాయకుడు’ కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ ‘బిగ్ బాస్’ కార్యక్రమంలో పార్టిసిపెంట్ గా ఉన్న ఓవియా హెలెన్ ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ షో ద్వారా అత్యంత ప్రజాదరణ పొందిన పార్టిసిపెంట్ ఎవరైనా ఉన్నారంటే, అది ఓవియానే. అంతటి ప్రజాధరణ దక్కించుకున్న ఓవియా, హౌస్ ఆవరణలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇలా చేయడం షోలోని ఇతర పార్టిసిపెంట్ల మనోధైర్యాన్ని దెబ్బ తీసే విధంగా ఉంటుందన్న నేపధ్యంలో… వెంటనే ఆమెను ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటికి పంపించేసారు షో నిర్వాహకులు.
గత కొన్ని రోజులుగా ఇతర పార్టిసిపెంట్లు తన పట్ల చూపిస్తున్న ప్రవర్తన వల్ల మానసికంగా సంఘర్షణకు లోనవుతున్న ఓవియా, ఎలాగైనా ‘బిగ్ బాస్’ ఇంటి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, బిగ్ బాస్ ఇంటికి ప్లంబింగ్ వర్క్ చేసే ఇబ్రహీం షేక్ అనే వ్యక్తి సెట్లోనే మరణించడంతో ఈ కార్యక్రమం మరోసారి వివాదాస్పదంగా మారింది. మొదట నుండి ఏదో ఒక వివాదంలో ఉంటున్న తమిళ బిగ్ బాస్ కు పెద్దగా పేరు రాకపోతుండటంతో నిర్వాహకులే కావాలని వివాదాలు సృష్టిస్తున్నారన్న టాక్ సొంతమైంది.


