తెలుగుదేశం పార్టీ కనీవినీ ఎరుగని ఓటమిని చవి చూసింది. ఓడిపోవడం వరకు సరే గానీ ఇంత ఘోరమైన ఓటమికి కారణం ఏంటో ఆ పార్టీకి అంతుచిక్కడం లేదు. 175 సీట్లు కలిగిన అసెంబ్లీలో ఇప్పుడు ఆ పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నో కంచుకోటలు కూలిపోయాయి మంత్రులు సైతం ఓడిపోయారు. అయితే ఇంతటి ఘోరపరాజయంలో కూడా ఆ పార్టీకి ఒక చిన్న ఊరట లభించింది. ఎన్నికైన వారిలో మంచి వాగ్ధాటి కలిగిన వారు ఉండటం.
అచ్చెన్నాయుడు బాగా మాట్లాడగలరు. సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుభవం కూడా అసెంబ్లీలో ఉపయోగపడుతుంది. గతంలో ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ వాణి బలంగా వినిపించిన పయ్యావుల కేశవ్ ఈ సారి గెలిచారు. దివంగత నేత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని మొదటి సారిగా గెలిచారు. ప్రచారంలో ఆవిడ వాగ్ధాటి అందరినీ ఆకర్షించింది. అవకాశాలు ఇచ్చి చూస్తే మంచి నేతగా మారే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో వీరు కీలక పాత్ర పోషించాల్సి ఉంది.
మరోవైపు గెలిచింది ముగ్గురు ఎంపీలే అయినా వారంతా ప్రతిభావంతులే. గతంలో మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టి పార్లమెంట్ లో గడగడలాడించిన ముగ్గురూ మరోసారి ఎన్నిక కావడం విశేషం. విజయవాడ నుండి కేశినేని నాని, శ్రీకాకుళం నుండి రామ్మోహన్ నాయుడు, మరియు గుంటూరు నుండి గల్లా జయదేవ్ టీడీపీ తరపున గెలిచారు. అయితే గెలిచిన నేతలను పార్టీలో ఉంచుకోవడం కూడా చంద్రబాబు నాయుడుకు కత్తి మీద సామే అనుకోవాలి. ఒకరకంగా ఈ ఐదు సంవత్సరాలు ఆ పార్టీకి జీవన్మరణ సమస్య అనే చెప్పుకోవాలి.



