రాజకీయంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనేక ఆరోపణలు గుప్పించిన వైసీపీ, తాజాగా మరో సంచలన ఆరోపణలు చేసింది. వైసీపీలో ముఖ్యనేతగా, జగన్ కు అత్యంత సన్నిహితుడైన భూమన కరుణాకరరెడ్డి, తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… “వైసీపీ అధినేత జగన్ ను భౌతికంగా అంతమొందించడానికి కుట్రలు చేస్తున్నారని, ఈ విషయాన్ని చంద్రబాబు సన్నిహితుడే తన వద్ద ప్రస్తావించారని” సంచలన ఆరోపణలు గుప్పించారు.
రాజకీయంగా జగన్ ను ఎదుర్కొలేక… అక్రమాస్తుల కేసుల్లో మళ్ళీ జైలుకు పంపించాలన్న కుట్రలు జరుగుతున్నాయని, ఇందుకోసం చంద్రబాబు అనేకమందితో సంప్రదింపులు చేస్తున్నారని, మేము ఏం చేస్తున్నామో అధికార పక్షానికి తెలిసినట్లే, చంద్రబాబు వర్గం ఏం చేస్తుందో మాకు చెప్పడానికి కూడా అక్కడ మనుషులు ఉన్నారని, వాళ్ళ ద్వారానే ఈ విషయం తెలిసిందని, ఒకవేళ కేసులలో జైలుకు పంపడం కుదరని పక్షంలో, ఏకంగా భౌతికంగా లేకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలు చేసారు.
అయితే రాజకీయంగా ఎన్ని ఆరోపణలైనా చేస్తారు గానీ, ఇలాంటి సాక్ష్యాలు లేకుండా చేయరు కదా… మీ వద్ద ఏమైనా సాక్ష్యాలు ఉంటే బయటపెట్టండి… అంటూ సదరు మీడియా ప్రతినిధి అడిగిన దానికి నీళ్ళు నమిలిన భూమన, చివరికి చంద్రబాబు సన్నిహితుడే తనకు ఈ విషయాన్ని చెప్పారంటూ అధికార పక్షంపైకి బురద జల్లే కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ నెల 23వ తేదీన ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సిన నేపధ్యంలో… జగన్ అరెస్ట్ కావచ్చంటూ గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బహుశా ఇదే కార్యరూపం దాలిస్తే… దానిని చంద్రబాబుపైకి తోసేయడానికి వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హత్యా రాజకీయాలకు చంద్రబాబు పూర్తిగా దూరమన్న విషయం రాజకీయాల్లో జగమెరిగిన సత్యమేనని… గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని వందల మంది టిడిపి కార్యకర్తలు హతమొందగా.., చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత గత రెండున్నర్రేళ్ళుగా పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమేనని, ఇలాంటి చవకబారు ఆరోపణలు కేవలం వైసీపీకే సాధ్యమవుతాయంటూ టిడిపి వర్గాలు మండిపడుతున్నాయి.



