సెప్టెంబర్ 10వ తేదీన జగన్ ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్‌లను వాయిదా వేసుకొని రాజమండ్రి వచ్చి చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత అక్కడికక్కడే టిడిపి, జనసేనలు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తాయని ప్రకటించారు. ఇది జరిగి నెలరోజులైంది. ఆ తర్వాత రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయడం ప్రారంభించారు. కానీ సమన్వయ కమిటీలు వేసుకోవడానికి రెండు పార్టీలు చాలా సమయం తీసుకొన్నాయి.
నెలరోజుల తర్వాత జనసేనతో సమన్వయం కోసం టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నిన్న ఆదివారం ఏర్పాటు చేసుకొన్నారు. దానిలో మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సభ్యులుగా ఉంటారు.
అయితే ఇది ఉమ్మడి రాజకీయ కార్యాచరణకు మాత్రమే పరిమితమా లేదా రెండు పార్టీల సీట్ల సర్దుబాట్లపై కూడా చర్చించి ఖరారు చేస్తుందా?అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. వైసీపి అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికలకు గట్టిగానే సన్నాహాలు చేసుకొంటోంది. కానీ టిడిపి, జనసేనలు ఇంతవరకు సీట్ల సర్దుబాట్లపై చర్చలు కూడా మొదలుపెట్టలేకపోతున్నాయి.
ఈ కారణంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ఏ పార్టీ ఏఏ స్థానాల నుంచి పోటీ చేయబోతోందనే స్పష్టత లేకపోవడం వలన రెండు పార్టీలు దేనికవి అభ్యర్ధులను ఖరారు చేసుకొంటున్నాయి. దీని వలన పొత్తులకు ఇబ్బంది కలగవచ్చు. ముఖ్యంగా ఆయా స్థానాల నుంచి పోటీకి సిద్దమవుతున్న రెండు పార్టీలలోని ఆశావాహులు సీట్ల సర్దుబాట్ల తర్వాత టికెట్స్ లభించకపోతే తీవ్ర అసంతృప్తితో పార్టీలను వీడితే రెండు పార్టీలు నష్టపోతాయి. కనుక సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీలు ఎంత త్వరగా నిర్ణయం తీసుకొంటే అంత మంచిది.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలు చేస్తూ ప్రజల మద్యన ఉన్నట్లే, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వీలైనంత త్వరగా యువగళం పాదయాత్ర మొదలుపెడితే మంచిది. వైసీపి అప్పుడే బస్సు యాత్రలు, బహిరంగ సభలకు సిద్దమవుతుంటే టిడిపి, జనసేనలు వెనకబడిపోతే ఎలా?



