టిడిపి, జనసేనలో అసంతృప్త రాగాలు… వైసీపితో చిక్కులూ తప్పవు!

TDP Janasena

టిడిపి, జనసేనలు నేడు శాసనసభ ఎన్నికలకు తొలి జాబితాని విడుదల చేయడంతో రెండు పార్టీలలో అలకపాన్పు సీన్లు, అసంతృప్త రాగాలాపనలు మొదలవుతాయి.

ADVERTISEMENT

ముందుగా జనసేన శ్రేయోభిలాషులు కచేరీ మొదలుపెట్టేశారు. తొలి జాబితాలో టిడిపికి 94, జనసేనకు కేవలం 24 సీట్లు ప్రకటించడం చాలా అన్యాయమని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం జనసేన మాత్రమే త్యాగాలు చేయాలా? టిడిపి చేయదా?అని శ్రేయోభిలాషులు ప్రశ్నిస్తున్నారు.

బీజేపీ కోసం జనసేన ఒక్కటే ఎందుకు త్యాగం చేయాలి?టిడిపి కూడా త్యాగం చేయాలి కదా?ఈ లెక్కన టిడిపి, జనసేనలు ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వస్తే సంకీర్ణ ప్రభుత్వంలో జనసేన స్థానం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ తొలి జాబితా ప్రకటిస్తున్నప్పుడు వారి పక్కనే ఉన్న నాగబాబు మొహంలో తీవ్ర అసంతృప్తి, అసహనం కనిపిస్తోందని శ్రేయోభిలాషులు కనిపెట్టి చెప్పారు.

ఇది జనసేన వెర్సస్ టిడిపి వెర్షన్ కాగా, మళ్ళీ రెండు పార్టీలలో టికెట్‌ దక్కని వారి అలకపాన్పులు, అసంతృప్త రాగాలు, అసమ్మతి సెగలు వేరేగా ఉంటాయి. నేడో రేపో అవీ మొదలవుతాయి. కనుక వైసీపికి చేతి నిండా పనే!

టిడిపి నేతలు అంత త్వరగా వైసీపి గాలానికి చిక్కకపోవచ్చు కానీ జనసేన నేతలని వైసీపి ఏకంగా వల వేసి పట్టేయగలదు. కనుక పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు, నాదెండ్ల మనోహర్‌ ముగ్గురూ వారిని బుజ్జగించుకొని వైసీపి వలలో పడకుండా కాపాడుకోవలసి ఉంటుంది.

ఇదేగాక టిడిపితో జనసేన పొత్తు పెట్టుకుంటే కాపులకు తీరని అన్యాయం జరుగుతుందని తాము మొదటి నుంచే హెచ్చరిస్తున్నామని, జనసేనకు కేవలం 24 సీట్లు కేటాయించి టిడిపి ఏకంగా 94 సీట్లు తీసుకోవడంతో తమ అనుమానాలు నిజమని తేలాయంటూ వైసీపి నేతలు కాపు సామాజికవర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకుండా ఉండరు. కనుక ఈ తొలి జాబితా ప్రభావంతో వారు పార్టీకి దూరం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత కూడా పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు, నాదెండ్ల మనోహర్‌ల మీదే ఉంతుంది.

టిడిపి విషయానికి వస్తే దాదాపు సీనియర్లందరికీ టికెట్స్ లభించాయి. ఇంకా ఎవరైనా మిగిలిపోతే తదుపరి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ టిడిపికి ఇప్పుడు మరో రకమైన సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

ఇంతకాలం కొన్ని నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్ధులు ఖరారు చేయకపోవడం వలన వైసీపికి వారి గురించి ‘క్లూ’ లభించలేదు. కానీ ఇప్పుడు అభ్యర్ధులు ఎవరో తెలిసిపోయింది కనుక ఇక నుంచి వారినే లక్ష్యంగా చేసుకొని కేసులు నమోదు చేయవచ్చు లేదా వారిని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నించవచ్చు. కనుక చంద్రబాబు నాయుడు, పార్టీలో సీనియర్ నేతలు ఇక నుంచి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ADVERTISEMENT
Latest Stories