రానున్న సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ-జనసేనలతో పాటు బీజేపీ కూడా జత కట్టిన వైనం, ఆ తర్వాత సీట్లను ప్రకటించిన విధానం రాజకీయ విజ్ఞులకు సుపరిచితమే. అభివృద్ధి అన్న పదానికి అర్ధం లేకుండా, అరాచకం అన్న దానికి పర్యాయపదంగా సాగుతోన్న జగన్ పాలనను ఎలా అయినా నిలువరించే క్రమంలో మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నట్లుగా ప్రకటించుకున్నాయి.
పొత్తు అయితే పెట్టుకున్నట్లున్నారు గానీ, ఈ మూడు పార్టీల నడుమ జరుగుతోన్న సీట్ల పంపకాల తీరు, తెరవెనుక జరుగుతోన్న రాజకీయ రణరంగం ప్రజలలో అనేక సందేహాలకు తావిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజక వర్గం నుండి కొత్తగా పార్టీలోకి చేర్చుకున్న వ్యక్తికి సీటు కేటాయించే వరకు పొత్తులో భాగంగా చేస్తోన్న ప్రయత్నాలన్నీ విమర్శలకు తావిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ పొత్తులో బీజేపీ చేరిన తర్వాత జరుగుతోన్న పరిణామాలు టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తల ఆవేదనకు కారణమవుతున్నాయి. పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రత్యర్థి రాజకీయ పార్టీకి అవకాశం ఇవ్వకుండా ఒక్కో మెట్టు ఎదుగుతూ, మరో విధంగా చెప్పాలంటే ప్రత్యర్థి వర్గాన్ని తొక్కుకుంటూ ముందుకు సాగాలి. రాజకీయ చరిత్ర నేర్పిన పాఠం ఇదే.
కానీ టీడీపీ-జనసేనలతో బీజేపీ జోడి కట్టిన తర్వాత భస్మాసుర హస్తం మాదిరి, తమను తామే తొక్కుకునే విధంగా ప్రత్యర్థి జగన్ వర్గాలకు మేలు జరిగే విధంగా రాజకీయం జరుగుతుండడం విస్తుపోయే విషయం. ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తారసపడడం లేదా? తెలుసుకున్నా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారా?
ఏమో… ప్రస్తుతానికి ఇది ఓ ప్రశ్నగానే ఉంది గానీ, పొత్తు ప్రకటన వచ్చిన నాటి నుండి బలపడాల్సిన పార్టీలు కాస్త బలహీన పడే విధంగా రాజకీయాలు జరుగుతుండడం ఏ మాత్రం ఆశించదగ్గ పరిణామం కాదు. పొత్తు పెట్టుకుంటే ప్రత్యర్థులను పొడవాలి గానీ, మనకు మనమే పొడుచుకునేలా ఉండకూడదన్నది రాజకీయ విజ్ఞుల మాట. అర్ధమవుతోందా బాబు గారు… కళ్యాణ్ గారు..!





