PK janasenaటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఎన్నాళ్ళుగానో రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రకటనకు నేటితో తెరపడింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారంటూ అగ్గిలం మీద గుగ్గిలం అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటనతో ఏపీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.

టీడీపీ – జనసేనలతో బీజేపీ కలుస్తుందా? లేదా? అన్నది పక్కన పెడితే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఈ రెండు పార్టీల మధ్య శాసనసభ సీట్ల పంపకాలు ఎలా ఉండబోతున్నాయనే ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి. ఓ విధంగా చెప్పాలంటే ఈ సీట్ల పంపకాల విషయంలో ఏపీలో ఉన్న మూడు ప్రధాన పార్టీల నుండి ఒక్కో అభిప్రాయం వెలువడుతోంది.

ముందుగా జనసేన విషయానికి వస్తే… టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు గానీ, జనసేన పార్టీ వర్గాలు గానీ తక్కువలో తక్కువగా 60 సీట్ల వరకు కావాలని అంచనాలు వేస్తున్నారు. ఆ విధంగా సీట్ల కేటాయించని పక్షంలో పొత్తు పెట్టుకోకపోవడమే ఉత్తమమనే భావనలో ఉన్నారు. ఇలా పొత్తు ప్రకటన వచ్చిందో లేదో, అలా సోషల్ మీడియా వేదికగా జనసేన వర్గాలు ఈ దిశగా పెద్ద చర్చకే దారి తీసారు.

ఇక టీడీపీ వర్గాల మాటేమిటంటే, గత ఎన్నికలలో జనసేన పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతాన్ని బట్టి, ఇరు పార్టీల అభ్యర్థుల బలాబలాల రీత్యా 25-30 సీట్ల వరకు కేటాయించవచ్చనే ఆలోచనలు చేస్తున్నారు. బహుశా భవిష్యత్తులో ఈ దిశగానే అధికారిక ప్రకటన వెలువడవచ్చు.

మరీ ముఖ్యంగా చాలా స్థానాలలో క్షేత్రస్థాయిలో జనసేనతో పోలిస్తే, టీడీపీ బలంగా ఉండడం, చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో ప్రజల్లో పెరిగిన అభిమానం, సానుభూతి పతాక స్థాయిలో ఉన్నాయి. అలాగే అసెంబ్లీ స్థానాలలో తామే పోటీ చేస్తామని స్థానికంగా పార్టీలో పాతుకుపోయిన టీడీపీ నాయకులు అంచనాలు వేసుకోవడం కూడా, పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారనుంది. ఒక రకంగా చాలా స్థానాలలో తెలుగుదేశం పార్టీ బుజ్జగింపులు చేయాల్సిన పరిస్థితి తలెత్తనుందని చెప్పడంలో సందేహం లేదు.

ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ విషయానికి వస్తే… టీడీపీ – జనసేన పొత్తు ఏ మాత్రం మింగుడు పడని అంశంగా మారింది. దీనిని నివారించడానికి గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ కు ముందరి కాళ్లకు బంధాలు వేస్తూ మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. తాత్కాలికంగా ఇది కొంతవరకు పని చేసినప్పటికీ, తాము తీసుకున్న గోతిలో తామే పడ్డామనే విధంగా చంద్రబాబు అరెస్ట్ టీడీపీ – జనసేనలను ఏకం చేసింది.

అలాగే సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం జనసేన – టీడీపీ వర్గాలు జరుపుతున్న చర్చలలో సందట్లో సడేమియా మాదిరి వైసీపీ కూడా తమ పాచికను కదుపుతూ ఇరు వర్గాలను కాస్త రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనపడుతోంది. ఆర్ఆర్ఆర్ చెప్తూ ఉండే ‘పేటీఎం బ్యాచ్’ ఈ దిశగా పావులు కదుపుతున్నట్లుగా సోషల్ మీడియా తేటతెల్లం చేస్తోంది.

2014 ఎన్నికలలో టీడీపీ – జనసేనల కలయిక వైసీపీకి అధికారం రాకుండా చేయగా, గత ఎన్నికలలో ఈ రెండు పార్టీల ఒంటరి పోరు వైసీపీకి అధికారాన్ని తెచ్చిపెట్టింది. దీంతో రాబోయే ఎన్నికలలో ఎలా అయినా ఈ రెండు పార్టీల నడుమ చిచ్చుపెట్టడానికి వైసీపీ తమ అన్ని మీడియా వేదికలను, అన్ని అస్త్రశస్త్రాలను సంధింస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

చివరగా… అసలు పవన్ కళ్యాణ్ చేసిన పొత్తు పరమార్ధం చేసుకుంటే మాత్రం టీడీపీ – జనసేన వర్గీయులు “సీట్ల పంపకం మరియు ఎవరు సీఎం?” అనే ఊహాగానాలు ఏ మాత్రం చేయరు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితులలో ఏ విధంగా అయినా జగన్ చేతిలో ఉన్న అధికారాన్ని దూరం చేసి ఏపీని అభివృద్ధి పధంలో నిలపాలని, అలాగే ఈ రాచరికపు పరిపాలను అంతం చేసి స్వరాజ్య సామ్రాజ్యాన్ని స్థాపించాలనే సదుద్దేశం స్పష్టంగా కనపడుతోంది.

ఇది అర్ధం చేసుకుని ఇరువురి పార్టీ కార్యకర్తలు, అభిమానులు మసలుకుంటే….రాష్ట్రాభివృద్ధికి అడుగులు వేసిన వారవుతారు. లేదంటే మరోసారి చంద్రబాబు అరెస్ట్ లాంటి సంఘటనలు పునరావృతం అవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సంశయించాల్సిన పని లేదేమో!