వచ్చే ఏడాది ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి, జనసేనలు కనిపిస్తే నేను గుండు కొట్టించుకొని తిరుగుతానని మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో సవాలు చేశారు.
దానిపై టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా స్పందిస్తూ, “బొత్స సత్యనారాయణ ఇంతకు ముందు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉండేవారు. దానిలో ఉంటూ ఆ పార్టీకి నున్నగా గుండు కొట్టించేశారు. ఏపీలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడానికి విభజన సమయంలో ఆయన చేసిన నిర్వాకమే అని అందరికీ తెలుసు.
కాంగ్రెస్ పార్టీకి గుండు కొట్టించేసిన తర్వాత వైసీపీలో చేరి మంత్రి పదవి దక్కింకొన్న బొత్స సత్యనారాయణ, ఇప్పుడు ఆ పార్టీకి కూడా గుండు కొట్టించేయబోతున్నారు. ఉగాది తర్వాత వైసీపీయే కనబడకుండాపోతుంది. అప్పుడు విజయనగరంలో కోట జంక్షన్ వద్ద ఆయనతో సహా వైసీపీ నేతలందరూ ఉరేసుకొంటారేమో?
వచ్చే ఎన్నికలలో గెలుస్తామని మీకు అంత నమ్మకం ఉన్నట్లయితే ఉగాది వరకు ఎందుకు ఇప్పుడే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు కదా?
ఇప్పటివరకు మీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 సీట్స్?అంటూ మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆయన ప్రజలను ప్రాధేయపడుతున్నారు. ఒకవేళ తాను ఏమైనా తెలియక తప్పులు చేసిన్నట్లు భావిస్తే అందరూ తనను క్షమించి మళ్ళీ గెలిపించాలని వేడుకొంటున్నారు.
ఒంటరి పోరాటం చేస్తున్న మీ ఈ బిడ్డను మీరే కాపాడుకోవాలని ప్రాధేయపడుతున్నారు. అంటే ఈసారి గెలుస్తామనే నమ్మకం లేకనే కదా ప్రాధేయపడుతున్నారు. వైసీపీలో అందరి పరిస్థితి ఇంచుమించు ఇదే.
మీ కుటుంబం (బొత్స సత్యనారాయణ)లోని వారితో సహా మీ వైసీపీలోని 50 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్చులో ఉన్నారు. టికెట్ ఇస్తే వైసీపీకి గుడ్ బై చెప్పేసి టిడిపిలో చేరిపోతామని అడుగుతున్నారు. అంటే మీ పార్టీ పరిస్థితి ఏమిటో మీకు అర్దమయ్యే ఉంటుంది.
వచ్చే ఎన్నికలలో మీకు మేమే గుండు కొట్టిస్తాము. చీపురుపల్లిలో మిమ్మల్ని, విజయనగరంలో మీ తమ్ముడిని మేమే ఓడించి మీకు గుండు కొట్టిస్తాము. సిద్దామా? అంటూ సవాల్ విసిరారు.
టిడిపి నేతల మాటలలో ఈవిదంగా పూర్తి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంటుంది. అదే… వైసీపీ నేతలలో మేకపోతు గాంభీర్యమే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఉదాహరణకు 175 సీట్లు గెలుస్తామని రొమ్ములు విరుచుకొన్న జగన్మోహన్ రెడ్డే ఇప్పుడు బటన్ నొక్కుడు సభలలో నేను ఒంటరివాడిని. మీ ఈ బిడ్డను మీరే కాపాడుకోవాలంటూ ప్రజలను ప్రాధేయపడటమే.
అదేవిదంగా వైసీపీలో అందరూ తమ పనితీరు, తమ ప్రభుత్వం పనితీరు చూసి ప్రజలు తమను గెలిపిస్తారని చెప్పుకోరు. తమ అధినేత జగన్ మొహం చూసే తమను గెలిపిస్తారని నిసిగ్గుగా చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. వారు జగన్‌ని నమ్ముకొంటే ఆయన ప్రజలను ప్రాధేయపడుతున్నారు. వైనాట్ 175 సీట్స్? అని కాదు హౌ ఈజ్ పాజిబుల్? అని అడగాల్సి ఉంటుంది.



