ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టండి, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించండి, తద్వారా రాష్ట్రం పారిశ్రామికంగా ప్రగతి చెందుతుంది అంటూ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న విజ్ఞప్తులను కొంతమంది టీడీపీ పార్టీ శ్రేణులు ఇలా అర్ధం చేసుకున్నారేమో కానీ ఏపీలో కల్తీ మధ్య తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన మూలకాల చెరువు లో కొంతమంది అధికార టీడీపీ నేతలు నకిలీ మద్యం తయారుచేస్తున్నట్టు గుర్తించారు. అయితే విషయం వెలుగులోకి రావడంతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటన పై సీరియస్ అయ్యారు.
అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సంఘటనకు పాల్పడిన వారిని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అసలు విషయానికొస్తే, తప్పు చేస్తే అది తన పార్టీ వాడైనా క్షమించేది లేదు, కాపాడేది లేదు అనేలా బాబు తీసుకున్న ఈ చర్యలు నిజంగా హర్షణీయం.
అధికార పార్టీలో ఉంటే ఏదైనా చేసేయచ్చు, తమకు నచ్చినట్టు పరిస్థితులను మార్చేయొచ్చు అనే వారికి ఈ కల్తీ మద్యం దందా మంచి గుణపాఠమనే చెప్పాలి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే మాదిరి అధికార పార్టీ నేతలు నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వాటిని అమ్మకలకు పెట్టేవారు.
కానీ నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైస్ జగన్ తన పార్టీ నేతలు చేసిన చర్యలను ఏనాడూ ఖండించలేదు, వారి ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయలేదు. కానీ నేడు ఈ కల్తీ మధ్య తయారీ దందా వెనుక టీడీపీ నాయకులు ఉన్నప్పటికీ వాటిని దాచిపెట్టడానికి కూటమి తన అధికారాన్ని కంచెగా వెయ్యలేదు.
అక్రమాలకు పాల్పడితే, ప్రజల ప్రాణాలతో వ్యాపారం చెయ్యాలని అనుకుంటే అది సొంత పార్టీ వారైనా ఉపేక్షించేది లేదు అనేలా కూటమి ప్రభుత్వం చర్యలకు పాల్పడడం ఒక మంచి పరిణామమనే చెప్పాలి. అయితే ఇలా కల్తీ మద్యం తయారీ కేంద్రాలను కూడా పరిశ్రమలుగా భావించి వాటి మీద పెట్టుబడులు పెట్టాలి అనుకునం వారికీ ఇది ఒక గట్టి హెచ్చరికగా భావించాలి.




