ఎన్నికల సంవత్సరంలో మహానాడు… టిడిపి దశ, దిశ మార్చబోతోందా?

TDP_MLC_Elections_2023మే 28,29 తేదీలలో రాజమహేంద్రవరంలో మహానాడు సమావేశాలు జరుగబోతున్నాయి. 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు మహానాడు సమావేశాలు మొదలవుతాయి. మహానాడు నిర్వహించేందుకు వేమగిరి, ధవళేశ్వరం జాతీయ రహదారి పక్కన 50 ఎకరాలలో టిడిపి నేతలు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ మహానాడు సమావేశాలకు 50 వేల మందికి పైగా టిడిపి ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు. కనుక వారి వాహనాల పార్కింగ్ కోసం మరో 50 ఎకరాలను చదును చేసి సిద్దం చేస్తున్నారు.

ADVERTISEMENT

వీరందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాలు, మళ్ళీ సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజున శాఖాహారం, రెండో రోజున శాఖాహారంతో పాటు మాంసాహారం భోజనాలు కూడా అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ ఒకే చోట కాకుండా 4-5 ప్రాంతాలలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ మహానాడు సమావేశాలలో 15 తీర్మానాలు చేసి ఆమోదించనున్నారు. అలాగే రాబోయే ఎన్నికలకు పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చబోయే ముఖ్యాంశాలను కూడా ఈ మహానాడులో వెల్లడించనున్నారు. విజయదశమి (దసరా) రోజున పార్టీ మ్యానిఫెస్టోని విడుదల చేయబోతున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీ సాయంత్రమే రాజమహేంద్రవరం చేరుకొని మహానాడు సమావేశాల ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి మహానాడులో చర్చించాల్సిన ముఖ్య అంశాలను ఖరారు చేస్తారు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిడిపి ముఖ్య నేతలను, కార్యకర్తలను వేధిస్తుండటంతో పార్టీలో ఓ రకమైన స్తబ్దత నెలకొంది. గత ఏడాది ఒంగోలులో అట్టహాసంగా మహానాడు నిర్వహించడంతో పార్టీలో మళ్ళీ కొత్త ఉత్సాహం మొదలైంది. అప్పటి నుంచే టిడిపి మళ్ళీ పుంజుకొని ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీని కంగు తినిపించే స్థాయికి ఎదిగింది.

ఈసారి మహానాడు ఎన్నికల సంవత్సరంలో జరుగబోతోంది. కనుక మహానాడులో చంద్రబాబు నాయుడు పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. నాలుగేళ్ళుగా వైసీపీ వేధింపులను భరిస్తున్న టిడిపి శ్రేణుల్లో ఈ మహానాడు ద్వారా భవిష్యత్‌ మనదే అనే నమ్మకం, కొత్త ఉత్సాహం కలుగుతుంది. కనుక ఎన్నికల సంవత్సరంలో జరుగబోతున్న ఈ మహానాడు టిడిపికి చాలా కీలకమైనది.

ADVERTISEMENT
Latest Stories