తెలంగాణ రాష్ట్రంలో మంచి నిలకడగల కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ళుగా అధికారంలో ఉంది. పైగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ధృఢ సంకల్పం, చిత్తశుద్ధి, పట్టుదల కూడా ఉన్నాయి. కేసీఆర్ నేతృత్వంలో మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా టీమ్‌వర్క్ చేస్తున్నారు. అందరి ఆశయం, లక్ష్యం ఒకటే కావడంతో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది మన కళ్లెదుటే ఉంది.
ఏపీలో కూడా పూర్తిమెజార్టీ కలిగిన వైసీపీ ప్రభుత్వం ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సిఎం జగన్‌కు వీర విధేయంగానే మసులుకొంటున్నారు. ఎవరైనా తోకజాడిస్తే అరికాళ్ళు వాచిపోతాయి లేదా మెడ పట్టుకొని బయటకు గెంతెస్తారు. అధికారులు అందరూ కూడా ముఖ్యమంత్రి, మంత్రుల కనుసన్నలలో ఒదిగి ఒదిగి పనిచేస్తున్నారు. కనుక జగన్ మూడంటే మూడే అని ఒకటంటే ఒకటే రాజధాని అంటూ వైసీపీలో అందరూ కోరస్ పాడుతుంటారు. అభివృద్ధి వద్దు… సంక్షేమమే ముద్దు అంటే అందరూ అవునవునంటారు. సంక్షేమమే అభివృద్ధి అంటే తానతందానా అంటారు.
ఉద్యోగులు తోక జాడిస్తే వారినీ దండోపాయంతో దారికి తెచ్చుకొన్నారు. కనుక తెలంగాణలో ప్రభుత్వం ఎంత ధృఢంగా నిలకడగా ఉందో ఏపీలో కూడా అలాగే ఉందని అర్దమవుతోంది. కానీ తెలంగాణ రాష్ట్రంలాగా ఏపీ అభివృద్ధి సాధించలేకపోతోంది. కారణాలు అందరికీ తెలుసు.
జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోయినా మామూలుగా పనిచేసుకుపోతున్నట్లయితే రాష్ట్రం దానంతట అదే అభివృద్ధి చెంది ఉండేది. కానీ మూడు రాజధానుల దెబ్బకి అటు అమరావతిలో, ఇటు ఉత్తరాంద్ర జిల్లాలలో రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా నష్టపోతోంది. దానికి తోడు ఇసుక మాఫియా, మట్టి మాఫియా, భూకబ్జాలు, దౌర్జన్యాలు, పన్నులు, ఛార్జీలమోత, కరెంటు కోతలు సకల అవలక్షణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తల్లడిల్లిపోతోంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి రాష్ట్రానికి శాపంగా మారిందని చెపొచ్చు. 2014 ఎన్నికలప్పుడు ప్రజలు ఎటువంటి అయోమయం లేకుండా టిడిపిని గెలిపించారు. మళ్ళీ 2019లో వైసీపీని అదేవిదంగా గెలిపించారు. కానీ ఈసారి టిడిపి, వైసీపీలలో దేనివైపు మొగ్గుతారో తెలీని పరిస్థితి కనిపిస్తోంది.
మళ్ళీ ప్రభుత్వం మారే సూచనలు కనిపిస్తుండటంతో రాష్ట్రంలో ఓరకమైన రాజకీయ అనిశ్చిత నెలకొని ఉంది. కనుక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అంటే… మరో ఏడాదివరకు ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎవరూ కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు సాహసించకపోవచ్చు.
కానీ విశాఖలో ఇన్‌ఆర్బిట్ మాల్ ఎందుకు పెట్టుబడి పెడుతోంది?అంటే తమని జగన్ ప్రభుత్వమే తీసుకువచ్చింది కనుక మళ్ళీ అదే అధికారంలోకి వస్తే ఎలాగూ సహకరిస్తుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చినా తమను ఇంకా ప్రోత్సహిస్తారే తప్ప తరిమేయరనే నమ్మకమే.



