అనుకున్నట్లుగానే ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాకు బంగ్లాదేశ్ చుక్కలు చూపించింది. ఇచ్చింది తక్కువ లక్ష్యమే అయినా, దానిని టీమిండియా అందుకోవడానికి చివరి బంతి వరకు శ్రమించేలా అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించి క్రికెట్ ప్రేమికుల మెప్పును పొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ వీక్షకులకు కావల్సినంత కిక్ ను కూడా పంచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు అమోఘమైన ఆరంభాన్ని ఇచ్చి టీమిండియా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ముఖ్యంగా లితిన్ దాస్ విరుచుకుపడి 121 పరుగులను నమోదు చేసాడు. తొలి 20 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసిన బంగ్లా, 120 వద్ద తొలి వికెట్ ను కోల్పోగా, 222 పరుగులు చేసే సమయానికి ఆలౌట్ అయిపోయింది. అంటే 10 వికెట్లను కేవలం 102 పరుగుల తేడాతో కోల్పోయింది.
టీమిండియా స్పిన్నర్లు కులదీప్ యాదవ్, కేదార్ జాదవ్ లు బంగ్లా బ్యాట్స్ మెన్లను నిలువరించడంలో సక్సెస్ అయ్యారు. వీరికి చాహల్, జడేజాల నుండి మంచి తోడ్పాటు లభించింది. అనంతరం తేలికపాటి లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా, తొలి వికెట్ ను 35 పరుగుల వద్ద కోల్పోగా, ఆ వెంటనే రాయుడు కూడా స్వల్ప స్కోర్ కే వెనుదిరిగాడు. ఈ తరుణంలో రోహిత్ శర్మ 48, దినేష్ కార్తీక్ లు 37 పరుగులతో ఆదుకున్నారు.
కానీ దశల వారీగా వికెట్లను కోల్పోవడం, కేదార్ జాదవ్ ఇంజురీతో వెనుదిరగడం భారమంతా లోయర్ ఎండ్ పై పడింది. ఈ తరుణంలో భువనేశ్వర్ కుమార్ (21) చూడచక్కటి ఇన్నింగ్స్ ను ఆడి, టీమిండియా లక్ష్యానికి చేరువ చేసాడు. చివరి ఓవర్లో విజయానికి 6 పరుగులు కావాల్సి ఉండగా, మళ్ళీ బరిలోకి దిగిన కేదార్ జాదవ్ (23 నాటౌట్) కు, కులదీప్ యాదవ్ (5 నాటౌట్) సమయస్పూర్తి బ్యాటింగ్ తో చివరి బంతికి టీమిండియా విజయం సాధించింది.
బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్, మొర్తజా, రుబెల్ హుస్సేన్ లు అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించి, టీమిండియా బ్యాట్స్ మెన్లను కట్టడి చేసారు. ఫైనల్ గా… ఏడవ సారి టీమిండియా ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. రాహుల్ ద్రావిడ్ తర్వాత వరుసగా కెప్టెన్సీ చేసిన నాలుగు టోర్నీలలోనూ విజయాలు సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. ఫైనల్ బంతిలో విజయం సాధించడంతో అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్న మాట వాస్తవం.



