తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న పోలింగ్ జరిపి, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడుతుంది. ఏపీ ఎన్నికలకు ముందు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి కనుక ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై తప్పకుండా ఉంటుంది.
ఒకవేళ తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గెలిచి మూడోసారి ముఖ్యమంత్రి అయితే ఇక ఆయనకు తిరుగే ఉండదు. అప్పుడు ఆయన ఏపీలో నిద్రాణ స్థితిలో ఉంచిన బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ నిద్రలేపి యాక్టివ్ చేస్తారు. ఏపీలో ఆయన భజన చేసే రాజకీయ నిరుద్యోగులు చాలామందే ఉన్నారు. కనుక వారందరూ కూడా కేసీఆర్ పంచన చేరుతారు.
అయితే కేసీఆర్ లక్ష్యం ఏపీలో గెలిచి అధికారంలోకి రావడం కాదు. వస్తే అది తెలంగాణ అభివృద్ధికి చాలా ఇబ్బందికరంగా మారవచ్చు. కనుక శాసనసభ ఎన్నికలలో మళ్ళీ వైసీపికి సహకరించి జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు తోడ్పడవచ్చు. అదే తెలంగాణకు చాలా మేలు కలిగిస్తుందని అందరికీ తెలుసు.
కేసీఆర్ తన కుర్చీలో కేటీఆర్‌ని కూర్చోబెట్టి జాతీయ రాజకీయాలకు షిఫ్ట్ అయ్యి ఢిల్లీలో చక్రం తిప్పాలనుకొంటున్న విషయం రహస్యమేమీ కాదు. కనుక కేసీఆర్ లక్ష్యం ఏపీలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడమే. శాసనసభ ఎన్నికలలో వైసీపికి తోడ్పాటు అందించి, అందుకు ప్రతిగా లోక్‌సభ ఎన్నికలలో జగన్ నుంచి సహకారం ఆశించవచ్చు.
ఒకవేళ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఏపీలో టిడిపి, జనసేన, వామపక్షాలతో కలిసి కూటమి ఏర్పాటు చేసి వాటి గెలుపుకోసం అన్ని విధాల సహకరించడం ఖాయం. అదే కనుక జరిగితే వైసీపి ఓటమి కూడా ఖాయమే.
ఒకవేళ తెలంగాణలో బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చిన్నట్లయితే, ఏపీలో వైసీపిని గెలిపించేందుకు అన్ని విధాల తోడ్పడవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీ కంటే టిడిపితో కలిసి సాగేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు కనుక.
ఒకవేళ తెలంగాణలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకుండా హంగ్ ఏర్పడితే, ఇప్పటికే మునిగిపోయి ఉన్న ఏపీకి అటువంటి దుస్థితి వద్దని ప్రజలు భావించిన్నట్లయితే, వైసీపి లేదా టిడిపి, జనసేనల కూటమిలో దేనికో దానికి పూర్తి మెజార్టీతో అధికారం కట్టబెట్టవచ్చు. కనుక తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికలపై ఏదో ఓ రూపంలో తప్పకుండా ఉంటుంది.



