బ్రహ్మాస్త్రం కోసం తెలంగాణలో పోటీలు

Telangana’s BC reservation row intensifies as Congress, BRS, and BJP turn the 42% quota issue into a major political weapon before elections.

తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ సెంటిమెంట్ రాజకీయాలకు చెక్ పెట్టడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌’ అస్త్రాన్ని ప్రయోగిస్తే, దానిని బీఆర్ఎస్‌ పార్టీతో సహా అన్ని పార్టీలు వాడేసుకుంటున్నాయి. ఈ ప్రతిపాదనని సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ‘బీసీ ఐకాస’ నేడు ‘తెలంగాణ బంద్’కు పిలుపునిచ్చింది.

త్వరలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్నాయి.కనుక అధికార కాంగ్రెస్‌ పార్టీతో సహా అన్ని పార్టీలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి ‘బంద్’ చేస్తున్నాయి కనుక సంపూర్ణం, విజయవంతం అవుతుంది.

ADVERTISEMENT

పార్లమెంటులో చట్ట సవరణ చేయకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ పెంపు సాధ్యం కాదనే సంగతి బంద్‌లో పాల్గొంటున్న పార్టీలన్నిటికీ బాగా తెలుసు. అయినా శాసనసభలో ఈ బిల్లుకి ఆమోదం తెలిపాయి. అప్పుడే ఈ పేరుతో రాజకీయాలు మొదలయ్యాయి. నేడు ఈ బంద్‌తో అవి పరాకాష్టకు చేరాయంతే!

బీసీల పట్ల తమకు మాత్రమే చిత్తశుద్ధి ఉందని చాటింపు వేసుకునేందుకే మూడు పార్టీలు ఈ బంద్‌ని వాడుకుంటున్నాయి. పనిలో పనిగా తమ రాజకీయ ప్రత్యర్ధులపై పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నాయి.

ఒకవేళ ఇప్పుడు ఈ ఉప, స్థానిక ఎన్నికలు లేకపోతే మూడు పార్టీలు ఇలా రోడ్లపైకి వచ్చేవా?అంటే కాదనే చెప్పవచ్చు.

కనుక బీసీ రిజర్వేషన్స్‌ పేరుతో జరుగుతున్న ఈ రాజకీయ ఆదిపత్యపోరులో ఈ మూడు పార్టీలలో ఏదో ఒకటి తప్పక గెలుస్తుంది. కానీ వాటి రాజకీయ చదరంగంలో బీసీలు పావులుగా మిగిలి ఓడిపోతారు.

కనుక బీసీ రిజర్వేషన్స్‌ అంశాన్ని కేవలం ఓ రాజకీయ వ్యూహంగానే చూసినట్లయితే, దీంతో బీసీలను ఆకట్టుకొని బలపడదామని కాంగ్రెస్‌ పార్టీ అనుకుంది. కానీ ఇప్పుడు అన్ని పార్టీలు దీనిని తమకు అనుకూలంగా మలుచుకొని లబ్ది పొందాలని ఆరాటపడుతున్నాయి. ఇది కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద షాక్, ఎదురు దెబ్బే.

నిజానికి ఇది కాంగ్రెస్‌ పార్టీకి జాతీయ స్థాయిలో కూడా బ్రహ్మాస్త్రం వంటిదే. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఇది చాలా శక్తివంతమైన ఆయుధం అని గ్రహించి మొదట్లో ఈ పేరుతో పార్లమెంటు లోపలా, బయటా పోరాడింది. కానీ తర్వాత ఆసక్తి కోల్పోయింది.

అదే… కాంగ్రెస్‌ అధిష్టానం మిత్ర పక్షాలతో కలిసి బీసీ రిజర్వేషన్స్‌ కోసం గట్టిగా పోరాడుతూ ఉంటే, దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరిగి ఉండేది. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు కాంగ్రెస్‌ వెనుక నడవడమో వ్యతిరేకించడమో చేసి ఉండేవి. అప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ పార్టీదే పైచేయిగా ఉండేది.

కానీ కాంగ్రెస్‌ అధిష్టానం సిఎం రేవంత్ రెడ్డి అందించిన ఈ బ్రహ్మాస్త్రం విలువ తెలుసుకోలేక పక్కన పడేయడంతో ఈ అస్త్రాన్ని ఎత్తుకుపోతున్న మిగిలిన పార్టీలతో తెలంగాణ కాంగ్రెస్‌ కూడా పోటీ పడాల్సి వస్తోంది. కానీ తెలంగాణ కాంగ్రెస్‌ ఈ వేడిని ఇలాగే కొనసాగించగలిగితే, రాష్ట్రంలో సెంటిమెంట్ రాజకీయాల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ లేకుండా చేయగలిగితే, బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితి కురుక్షేత్రంలో కర్ణుడులా మారుతుంది.

చివరిగా ఒక మాట: ఆవులు పాలిచ్చేది దూడల కోసమే తప్ప మనుషుల కోసం కాదు. కానీ దూడల పేరుతో మనుషులు ఆ పాలు పిండుకొని వాడుకుంటారు. బీసీ రిజర్వేషన్స్‌పై జరుగుతున్న ఈ రాజకీయాలు కూడా ఇటువంటివే!

ADVERTISEMENT
Latest Stories