నేడు అదిలాబాద్‌లో బీజేపీ జనగర్జన సభ నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సభకు హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే బీజేపీ ఎంపీ బండి సంజయ్ “తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నా గురువు నా గురువు. ఆయన నుంచే ఈ భాష, మాటలు నేర్చుకొన్నాను. ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకొంటున్నాను,” అన్నారు.
బీజేపీ ఎన్నికల ప్రచార సభలో బండి సంజయ్ వంటి ఓ బీజేపీ సీనియర్ నేత తాము ఎవరితో పొరాడి గద్దె దించాలని ప్రయత్నిస్తున్నామో ఆయన గురించే ఈవిదంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ బండి సంజయ్ ప్రసంగం పూర్తిగా వింటే ఆయన కేసీఆర్‌ని పొగడటం లేదని కల్వకుంట్ల ఇంట్లో అధికారం కోసం కొట్లాటలు పతాకస్థాయికి చేరుకొన్నాయని చెపుతున్నట్లు అర్దమవడంతో అందరూ హాయిగా నవ్వుకొన్నారు.
ఇంతకీ బండి సంజయ్ ఏమన్నారంటే, “కేసీఆర్ నా గురువు. ఆయనకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. కొన్ని రోజుల నుంచి ఆయన ప్రజలకు, మీడియాకు కనబడటం లేదు. ఇది నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడున్నారు? ఆయనను కేటీఆర్ ఏం చేశారు? ఆయన క్షేమంగా ఉన్నారని ఒక్క మాట చెప్పాలని నేను బిఆర్ఎస్ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఇంట్లోనే చికిత్స తీసుకొంటున్నారు. ఆయనకు వైద్యం చేసినా మళ్ళీ మరోసారి ఇన్ఫెక్షన్ సోకడంతో వరంగల్‌లో నిర్వహించాలని తొలి మెగా బిఆర్ఎస్ సభను రద్దు చేసుకొన్నారు.
ఒకవేళ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే ఈసారి ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ నేతృత్వంలోనే బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొబోతోందని వార్తలు వస్తున్నాయి.
ఏనాడూ భర్త తోడు లేకుండా ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టని కేసీఆర్ సతీమణి శోభ, కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ్ళ తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. తొలిసారిగా ఆమె తలనీలాలు కూడా సమర్పించుకొన్నారు. భర్త ఆరోగ్యం కోసమే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకొని తల నీలాలు ఇచ్చి ఉండవచ్చు.
కనుక కేసీఆర్‌కు ఏదో అయ్యిందని బండి సంజయ్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది. కేసీఆర్ అంటే బిఆర్ఎస్ పార్టీ. బిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అన్నట్లు సాగుతుంటుంది. కనుక కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజయ్ అనుమానాలు లేవనెత్తడం ద్వారా బిఆర్ఎస్ పార్టీలో అభద్రతాభావం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది.
కానీ తెలంగాణలో బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తుందో రాదో ముందు బీజేపీ నేతలే తెలుసుకోవాల్సి ఉంది. ఒకవేళ రాలేకపోతే అప్పుడు కేటీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని కూడా బీజేపీకి తెలుసు.



