తెలంగాణ ఎన్నికలలో తెరాస తరువాత ఎక్కువ సీట్లలో పోటీ చేసిన పార్టీ బీజేపీ. ఆ పార్టీ 119 సీట్లకు గాను 118 సీట్లలో పోటీ చేసింది. ఒక్క సీటులో ఆ పార్టీ అభ్యర్థి విరమించుకుని కాంగ్రెస్ నుండి పోటీ చేసిన తన బాబాయ్ కి మద్దతు ఇచ్చారు. అసలైతే బీజేపీ ఈ ఎన్నికలలో 119 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది. అయితే ఎన్నికల ఫలితాల తరువాత మాత్రం ఆ పార్టీలోని డొల్లతనం బయట పడింది. 118 స్థానాలకు గానూ 103 స్థానాలలో డిపాజిటు కోల్పోయింది. కేవలం 15 స్థానాలలోనే ఆ పార్టీ డిపాజిట్ దక్కించుకుని వాటిలో కేవలం ఒక్కటంటే ఒక్క సీటులో మాత్రమే గెలిచింది.
[m9ad]
ప్రధాన పార్టీలలో ఎక్కువ డిపాజిట్లు కోల్పోయింది బీజేపీనే. బీజేపీ కోసం ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు బీజేపీ కోసం ప్రచారం చేశారు. అయినా ఆ పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. పార్టీ ప్రెసిడెంటు లక్ష్మణ్, ఆ పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి కూడా ఈసారి ఓడిపోయారు. 2014 ఎన్నికలలో టీడీపీ తో పొత్తుతో పోటీ చేసిన బీజేపీ అప్పట్లో ఓటమి నెపాన్ని సైకిల్ పార్టీ మీదకు తోసేసింది.
ఇప్పుడు ఎటువంటి పొత్తు లేకుండా వారికి కావాల్సిన వారికి సీట్లు ఇచ్చుకున్నారు. మరి ఇప్పుడేమి అయినట్టు? గతంలో వెంకయ్య నాయుడు బీజేపీని ఎదగనివ్వలేదు అని ఆయన మీద నిందలు వేశారు. ఆయన ఇప్పుడు క్రియాశీల రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకున్నారు. ఇప్పుడు బీజేపీ సాధించినది ఏంటి? ఇక్కడ కొసమెరుపు ఏంటంటే బీజేపీ నుండి గెలిచిన ఒకే ఒక్క నేత రాజాసింగ్ ను కూడా గతంలో పార్టీ నుండి వెళ్ళగొట్టడానికి పార్టీ సీనియర్లు విశ్వప్రయత్నం చేశారు. వారి సహకారం లేకుండానే గెలిచాడు రాజాసింగ్.
హిందువుల కోసం రాజా సింగ్ విశేషంగా చేసిన కృషి వల్ల ఆ సీటు గెలవగలిగారు. తరచుగా ఆయన మజ్లీస్ మీద చేసిన వివాదస్పద వ్యాఖ్యల వల్ల హిందువులు ఆయనకు గంపగుత్తుగా ఓట్లు వేసి గెలిపించారు. ఈ క్రమంలో తాము ఎక్కడ ఉన్నాం అన్నది తెలుసుకుంటే ఆ పార్టీకే మంచిది. గత నాలుగున్నర ఏళ్ళ కాలంలో ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఎప్పుడూ వ్యవహరించలేదు. అదే సమయంలో హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ ఆఫీసు దాటి వెళ్లి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నమూ ఎప్పుడూ చెయ్యలేదు.



