ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తుంది? సదరు వ్యక్తికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత ఫాలోయింగ్ ఉండాలి. ఎన్నికలు వస్తే అన్ని నియోజకవర్గాలకు తిరిగి శ్రేణులను సమాయత్తం చేసి ఓటర్లను తమ వైపుకు తిప్పుకోగల్గాలి. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఆయన మాత్రం ఆయన సొంత నియోజకవర్గం ముషీరాబాద్ లో ఎలాగైనా మళ్ళీ గెలవాలని తంటాలు పడుతున్నారు.
[m9ad]
రాష్ట్రంలోని నియోజకవర్గాలకు తిరగడం మాట దేవుడెరుగు ఆయన సొంత నియోజకవర్గంలోని గల్లీ గల్లీకి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. అయితే సర్వేల ప్రకారం ఈ సారి ఆయనకు డిపాజిట్ రావడం కూడా కష్టమేనట. ఒక టీవీ ఛానల్ సర్వే ప్రకారం ఆయనకు ముషీరాబాద్లో ఈసారి మూడవ స్థానం గారంటీ అని సమాచారం. 35% ఓట్లతో తెరాస ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో ముందంజేలో ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ 34% తో గట్టి పోటీ ఇస్తుంది. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ టికెట్ దక్కించుకోగా… తెరాస తరపున ముటా గోపాల్ పోటీలో ఉన్నారు.
పోలింగ్ కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇది తెరాస కాంగ్రెస్ మధ్య హోరాహోరి అనే చెప్పుకోవాలి. అయితే బీజేపీకి మాత్రం ఇక్కడ కేవలం 22% ఓట్లు రావొచ్చు అని సమాచారం. దీనితో డిపాజిట్ దక్కించుకోవడానికి లక్ష్మణ్ పోరాడుతున్నట్టు చెప్పవచ్చు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి డిపాజిట్ పోతే ఇక బీజేపీ తలెత్తుకునే పరిస్థితి ఉండదు. అసలైతే పార్టీకి 119 స్థానాలకు అభ్యర్థులను పెట్టే పరిస్థితి లేకపోయినా పరువు పోతుందని చాలా చోట్ల అడిగిన వారికీ అడగని వారికీ టిక్కెట్లు ఇచ్చుకుంటూ పోయారు.



