తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికరంలోకి రాబోతోందని సర్వేలన్నీ సూచిస్తున్నాయి. ఎలాగూ ఆదివారం ఈపాటికి స్పష్టమవుతుంది. కనుక ఇంకా ఊహాగానాలు అనవసరమే. కాంగ్రెస్ గెలుస్తుందా లేక బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా? రెంటిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఇక్కడ చర్చ కాదు.
తెలంగాణ సిఎం కేసీఆర్ తన రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసుకొని, అనేక సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలుచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాలలో, ముఖ్యంగా ఎన్నికల వ్యూహాల పన్నడంలో అపర చాణక్యుడని కేసీఆర్ పేరుగాంచారు. ఆయన మౌనంగా ఉన్నా ప్రతిపక్షాలు భయపడేవంటే తెలంగాణ రాజకీయాలను ఎంతగా శాశించేవారో అర్దం చేసుకోవచ్చు.
ఇక ఆయన వెంట అతిమహారధులని చెప్పుకోదగ్గ మంచి విషయ పరిజ్ఞానం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంత శక్తియుక్తులు, మంది మార్భలం, వేలకోట్లు ఖర్చు చేయగల సామర్ధ్యం కేసీఆర్‌కి ఉన్నాయి.
అంతటివాడికి కాంగ్రెస్ పార్టీ ముచ్చెమటలు పట్టించిందనేది ఎవరూ కాదనలేని నిజం. చివరికి కాంగ్రెస్ అభ్యర్ధుల ఇళ్ళపైకి ఐటి దాడులు చేయిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్‌కు ఎన్నికలలో పరోక్షంగా సహకరిస్తూనే ఉంది. అయినా సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే విజయం, అధికారం అని గంటాపదంగా చెపుతున్నాయి. అది వేరే విషయం.
ఇంతటి తెలివితేటలు, అంగబలం, అర్ధబలం అన్నీ ఉన్న కేసీఆర్ అంతటివాడు ఈ ఎన్నికలలో ఎదురీదవలసి వస్తే మరి ఏపీలో అసలు అభివృద్ధి ఊసే ఎత్తకుండా సంక్షేమ పధకాలనే నమ్ముకొని ఎన్నికలకు సిద్దమవుతున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?అనే సందేహం కలుగక మానదు.
సంక్షేమ పధకాలు తప్ప వైసీపి ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇంతకాలం అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలే అని వాదించి, ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ పధకాలు వేర్వేరని జగన్ కూడా గుర్తించిన్నట్లే ఉన్నారు. అందుకే హడావుడిగా శంకుస్థాపనలు చేస్తూ, వాటితోనే అభివృద్ధి జరిగిపోతోందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. సొంత మీడియాలో కూడా ఏపీ ఆర్ధిక, పారిశ్రామిక, మౌలిక, తదితర అన్ని రంగాలలో అభివృద్ధి జరిగిపోతోందని గ్రాఫిక్స్ చూపించడం మొదలుపెట్టింది.
శంకుస్థాపనలు,శిలాఫలకాలతో అభివృద్ధి జరుగుతుందనుకొంటే, ఈ 70 ఏళ్లలో చాలామంది చాలానే వేశారు కదా? అమరవతికి సాక్షాత్ ప్రధాని నరేంద్రమోడీ భూమిపూజ చేసి శిలాఫలకం వేశారు కదా? కానీ నిర్మించలేదు కదా?
అయితే కేసీఆర్ తెలంగాణ ప్రజలకు కళ్ళకు కనపడేవిదంగా అభివృద్ధి చేసి చూపించినా తిరస్కరిస్తున్నప్పుడు, ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రా ప్రజలు మళ్ళీ గెలిపించుకొని నెత్తిన పెట్టుకొంటారా?




