తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళుతున్న వేళ ఈ రిజర్వేషన్లు చట్ట విరుద్ధమంటూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు కావడం తో ఈ అంశం పై కోర్ట్ తీర్పు ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమయ్యింది.
అయితే తాజాగా విచారణ చేపట్టిన హై కోర్ట్ బీసీలకు 42% రిజర్వేషన్ అంటూ రేవంత్ సర్కార్ ఇచ్చిన జీవో పై స్టే విధించింది. అలాగే కేసు విచారణ పూర్తయ్యేవరకు స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఈ అంశం పై ప్రభుత్వం, పిటిషనర్ మరిన్ని వివరాలతో మరో రెండు వారాలలో కౌంటర్ దాఖలు చెయ్యాలంటూ ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీనితో తెలంగాణలో జరగనున్న స్థానిక ఎన్నికలు మరో నెల పాటు వాయిదా వేయక తప్పని పరిస్థితి.
అయితే బీసీ రిజర్వేషన్ల మీద న్యాయస్థానం ఇచ్చిన స్టే పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులూ రాజకీయం మొదలు పెట్టారు. ముందుగా అధికార కాంగ్రెస్ ఈ స్టే వెనుక బిఆర్ఎస్, బీజేపీ ల ‘హస్తం’ ఉందంటూ ఆరోపణలకు దిగితే, ఇక బీజేపీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనం అంటూ విమర్శలు ఎక్కుపెట్టింది.
42% రిజర్వేషన్ అంటూ రేవంత్ సర్కార్ బీసీ ల చెవిలో ‘పూలు’ పెట్టారంటూ బిఆర్ఎస్ అధికార పార్టీ పై విరుచుకుపడుతుంది. ఇలా అధికార కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష బిఆర్ఎస్, బీజేపీ లు మొదలు బీసీ రిజర్వేషన్ల అమలు మీద ఎవరికీ తోచిన రాజకీయ వారు నడిపిస్తున్నారు.
స్థానిక ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ అమలు చేసి తద్వారా వచ్చే రాజకీయ లబ్దిని తమ ప్రభుత్వ ఖాతాలో జమ చేసుకోవాలి రేవంత్ ప్రయత్నిస్తుంటే, ఈ రిజర్వేషన్ అమలు సజావుగా సాగిపోతే తమ పార్టీల బీసీ ఓటింగ్ కూడా గల్లంతవుతుందని బిఆర్ఎస్ భయపడుతుంది.
ఇక ఈ కుల రాజకీయాలలో తాము వెనకబడిపోతాము అనే ఆవేదనలో బీజేపీ అల్లాడుతోంది. ఇలా ఎవరికీ వారు 42% రిజర్వేషన్ల అంశం పై మల్లగుల్లాలు పడుతుంటే తీన్మార్ మల్లన్న మాత్రం అనువు కానీ చోట అధి’కుల’మేల అనేట్టు బీసీల హక్కుల కై టిఆర్పి ని స్థాపించారు.
స్థానిక ఎన్నికలలో ఈ 42 % బీసీ లకే దక్కాలి, ఈ స్థానాలలో పోటీ అనేది ఇతర కులాలకు అనువైనది కాదు అనేలా ఇప్పటికే తెలంగాణ బీసీ సమాజాన్ని కుల రాజకీయ రొచ్చులోకి తెచ్చేసాయి రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నాయకులు. అయితే ప్రస్తుతానికి కోర్ట్ ఇచ్చిన స్టే తో ఈ రిజర్వేషన్ల రాజకీయ లొల్లి తెలంగాణలో మరికొంతకాలం సాగకతప్పదు.




