తెలంగాణ ఏర్పడింది భూదోపిడీకేనా?

Telangana Land Scam: BRS and Congress Face Allegations

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చని, మన పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయంటూ బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ చాలా ఊరించారు.

రాష్ట్రం ఏర్పడింది. అయన హయంలో అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే యదేచ్చగా భూదోపిడీ మొదలైంది. అది నేటికీ కొనసాగుతూనే ఉంది.

ADVERTISEMENT

కేసీఆర్‌ హయంలో ధరణి పోర్టల్ పేరుతో వేలాది ఎకరాలు అక్రమంగా చేతులు మారాయంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్‌ విచారణకు ఆదేశించింది.

‘నాడు డొక్కు సైకిల్ మీద తిరిగిన కేసీఆర్‌కి వెయ్యి ఎకరాలు ఎలా వచ్చాయని’ సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూనే ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ వందల ఎకరాలు ఎలా వచ్చాయని అడుగుతూనే ఉన్నారు.

వాటికి వారు సమాధానం చెప్పడం లేదు. కనీసం ఆ ఆరోపణలను ఖండించడం లేదు కూడా. అంటే అర్థం ఏమిటి?

ఇప్పుడు రేవంత్ రెడ్డి సోదరులు పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, కాంగ్రెస్‌ మంత్రులు అందినకాడికి దండుకుంటున్నారని బీఆర్ఎస్‌, టీఆర్ఎస్‌ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

కాంగ్రెస్‌ నేతలు ఇష్టారాజ్యంగా భూదోపిడీలకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్‌ రావు కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీకి లేఖ వ్రాశారు.

తెలంగాణ రెవెన్యూ శాఖలో 22ఏ నిబంధన పేరుతో రాష్ట్రంలోని ప్రైవేటు భూములని ఉద్దేశ్యపూర్వకంగా నిషేదిత జాబితాలో చేర్చుతూ, వాటిపై కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని హరీష్‌ రావు ఆరోపించారు.

ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూములు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో, హెచ్‌ఎండీఏ అనుమతులున్న ప్లాట్లు, ఇళ్ళను కూడా నిషేధిత జాబితాలో చేర్చుతున్నారని ఆరోపించారు.

ఆ తర్వాత వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించేందుకు మార్కెట్ విలువలో 30 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని హరీష్‌ రావు ఆరోపించారు. అలాగే అధికార పార్టీలో కొందరు నేతలకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలతో 50:50 నిష్పత్తిలో డెవలప్‌మెంట్ ఒప్పందాలు చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని హరీష్‌ రావు ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ రెండు పార్టీ నేతల ఈ పరస్పర ఆరోపణల ప్రకారమే చూసినా, ఇదివరకు బీఆర్ఎస్‌, ఇప్పుడు కాంగ్రెస్‌ రెండింటి హయంలో తెలంగాణలో విచ్చలవిడిగా భూదోపిడీ జరుగుతోందన్న మాట!

ఇందుకేనా వేలాదిమంది బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది?

ADVERTISEMENT
Latest Stories