ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంలతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ కాసేపటి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
తెలంగాణలో పోలింగ్ తేదీ వెల్లడించినప్పటికీ.. ఎన్నికల షెడ్యూల్‌పై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. అసెంబ్లీ రద్దయిన రాష్ట్రాలకు ఆర్నెల్ల లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నదని, తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితా అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం వల్లే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
నవంబర్ 12న షెడ్యూల్ విడుదల చేస్తామని, డిసెంబర్ 7న ఒకే విడతలో మొత్తం 119 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. డిసెంబర్ 11న ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఈనెల 8న ఓటర్ల జాబితా అందాల్సి ఉందని, 12న ఓటర్ల జాబితాను ప్రకటించాలని తాము నిర్ణయించినట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.



