ఇండస్ట్రీకి వార్నింగ్ బెల్స్

Telugu Film Industry Slowdown

ఓ రెండేళ్ల క్రితం వరకు రామానాయుడు స్టూడియోలో కనీసం నెలకి నాలుగు సినిమా ఓపెనింగులు జరిగేవి. అన్నపూర్ణ స్టూడియోలో ఓ రెండు సినిమాల ఓపెనింగులు, అవి కాకుండా ఫిలిం నగర్, కృష్ణానగర్ ఏరియాల్లో వారానికి ఒక కొత్త ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెనింగులు వంటివి సర్వసాధారణంగా జరిగేవి. దాంతో ఇండస్ట్రీని నమ్ముకుని బ్రతికే చాలామందికి జీవనోపాధి లభించేది.

అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం మారిపోయింది. నెలకో సినిమా ఓపెనింగ్ జరగడం అనేది గగనం అయిపోయింది. ప్రొడక్షన్ ఆఫీసులు కూడా తగ్గిపోతున్నాయి. కొంతమంది సీనియర్ పీఆర్వోలతో మాట్లాడుతున్నప్పుడు “ఇదివరకు రోజుకి కనీసం నాలుగు ప్రొడక్షన్ హౌస్ లకి తిరిగేవాళ్ళం, అలాంటిది ఇప్పుడు వారానికి కూడా అన్ని లేకుండాపోయాయి” అని చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

ఇప్పుడు ఇండస్ట్రీలో సీనియర్ ప్రొడ్యూసర్స్ ఆధ్వర్యంలో మొదలైన కొన్ని సంస్థలు తప్ప.. ఇండిపెండెంట్ గా ప్రొడక్షన్ హౌస్ లు స్థాపించినవారు ఎవరూ ఇప్పుడు యాక్టివ్ గా లేరు. గత ఏడాది వారానికి 10 సినిమాల దాకా క్లియరెన్స్ సేల్ లా రిలీజ్ అయిపోయాక, ఇప్పుడు కనీసం నెలకి 10 సినిమాలు కూడా రెడీగా లేని పరిస్థితిలో ఇండస్ట్రీ ఉంది. ఇందుకు కారణం ఏమిటి? ఎందుకని కొత్త నిర్మాతలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందుకు రావడం లేదు? కొత్త ప్రాజెక్టులన్నీ ఎందుకని హోల్డ్ లో పడ్డాయి? వంటి ప్రశ్నలకి సరైన సమాధానాలు లేవు.

అయితే.. కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి భయపడడానికి, ఉన్న నిర్మాతలు కొత్త సినిమాలు తీయకపోవడానికి కారణం ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితిలు. యావరేజ్ సినిమా అనేది చచ్చిపోయింది, ఒకసారి ఎలా ఉందో చూద్దాంలే అని ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదు. సినిమా బాగుంది లేదా అదిరింది అనే టాక్ మాత్రమే జనాల్ని థియేటర్లకి నడిపిస్తుంది. అందుకు “పెద్ది, మా ఇంటి బంగారం” సినిమాలే పెద్ద ఉదాహరణలు. ఇది సరిపోదన్నట్లు.. ఫిలిం ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ.. కొత్త లేదా చిన్న నిర్మాతలకు సహాయపడడం లేదు. పాపం వాళ్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినా.. పట్టించుకునే నాథుడు లేడు. దాంతో ఇక్కడి నిర్మాతలు కూడా వేరే ఇండస్ట్రీలకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు తప్పితే.. తెలుగులో సినిమాలు తీయడానికి ముందుకు రావడం లేదు.

ఇవన్నీ కచ్చితంగా వార్నింగ్ బెల్సే. త్వరగా ఇండస్ట్రీ పెద్దలు, ఎక్స్ పర్టులు మేలుకొని ఇండస్ట్రీని సర్వైవ్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకోవాలి, ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలి, దర్శకులు పాన్ ఇండియా మత్తు నుండి బయటపడి, రీజనల్ సినిమాల మీద కాన్సంట్రేట్ చేయాలి. ఇవన్నీ జరిగితేనే తెలుగు చిత్రసీమకు మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. లేదంటే.. ఎప్పుడో రెండుమూడేళ్ళకి ఒకసారి వచ్చే రాజమౌళి సినిమా గురించి గొప్పలు చెప్పుకుంటూ.. మిగతా సమయాల్లో డబ్బింగ్ సినిమాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఎఫెక్ట్ కార్మికులు, మీడియా, మీడియేటర్స్, ఓటీటీ, శాటిలైట్, సింగిల్ స్క్రీన్స్.. ఇలా అన్ని వ్యవస్థలపైనా పడుతుంది. మరి ఇండస్ట్రీ పెద్దలు ఎప్పటికీ తేరుకుంటారో, ఎప్పటికల్లా ఇండస్ట్రీ స్థితిగతులను సరి చేస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories