శాసనసభ స్పీకర్ పదవికి వన్నె తెచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వారు ఎందరో ఉన్నారు. కానీ వైసీపీ హయంలో శాసనసభ స్పీకర్‌గా చేసిన తమ్మినేని సీతారం సరికొత్త విధంగా చరిత్రలో నిలిచిపోతారు.
శ్రీకాకుళం జిల్లాలో , భూకబ్జా కేసులో ఆయనతో సహా కుటుంబ సభ్యుల పాత్ర ఉందని పోలీసులు నిర్దారించడంతో ఆయన సోమవారం తెల్లవారు జామున ఆముదాలవలసలోని తన నివాసం నుంచి ప్రైవేట్ కారులో కుటుంబంతో సహా పరారయ్యారు.
ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు బహిర్గతమయిన తర్వాత కూడా అయన ఆముదాలవలసలోనే ఉన్నారు. కానీ ఆయనని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమవగానే జంప్ అయిపోయారు. తమ ఫోన్ల ద్వారా ఆచూకీ కనిపెట్టకుండా తప్పించుకునేందుకు తమ్మినేని కుటుంబ సభ్యులు తమ ఫోన్లని ఇంట్లోనే వదిలి పరారయ్యారు.
తమ్మినేని భూకబ్జాలలో స్థానిక టీఎస్‌ఆర్ కాలేజీ పక్కన 8 సెంట్లు, చింతామణి గ్రామంలో 23 ఎకరాలు, వేరొకరికి చెందిన ఓ ఇల్లు, చివరికి చనిపోయిన ఓ పోలీస్ కానిస్టేబిల్ ఇంటిని బలవంతంగా ఆక్రమించుకున్నారని ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
తమ్మినేని సీతారం నోటి దురుసు గురించి అందరికీ తెలుసు కానీ ఆయనలో ఇటువంటి మరో కోణం కూడా ఉందని ఈ భూకబ్జాలు…వాటి కేసులతో బయటపడింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన ఇవన్నీ చక్కబెడితే వాటిపై విచారణ జరిపి కేసు నమోదు చేసేందుకు పోలీసులు ఇంత సమయం తీసుకోవడం, అదివారం వరకు పోలీసుల కళ్ళెదుటే ఉన్న ఆయన, సోమవారం తెల్లవారుజామున తప్పించుకు పారిపోవడం విచిత్రంగానే అనిపిస్తుంది. బహుశః ముందస్తు బెయిల్ లభించే వరకు ఆయన ఆచూకీ లభించకపోవచ్చు.
వైసీపీ నేతలందరూ కూటమి ప్రభుత్వం తమపై అన్యాయంగా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయిస్తోందని చెప్పుకుంటారు. కానీ ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడబోమని కూడా ముక్తాయిస్తుంటారు.
మరి అలాంటప్పుడు ఇలా తెల్లవారుజామున పరారవడం దేనికి?కానీ బెయిల్ లభించిన తర్వాత మళ్ళీ అక్రమ కేసులు, రాజకీయ వేధింపులు అంటూ రంకెలు వేయడం దేనికి?అంబటి రాంబాబులా ధైర్యంగా నిలబడొచ్చు కదా?




