తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్‌లో దాదాపు ప్రముఖులు అందరూ పోటీలు పడుతూ ఘాటుగా స్పందించారు. మంత్రి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమే. అందుకు టాలీవుడ్ స్పందించడం సబబే. అయితే జగన్ హయాంలో ఎందరికి ఎన్ని అవమానాలు జరిగినా విప్పి మాట్లాడలేదు.
‘ముల్లు-అరిటాకు ప్రకారం నోరు విప్పి మాట్లాడితే చిరిగేది అరిటాకే అనే భయం, స్పృహ వారిని మాట్లాడనీయలేదని అందరికీ తెలుసు. మరయితే ఇప్పుడు తెలంగాణ మంత్రి కొండా సురేఖపై విరుచుకు పడితే, తెలంగాణలో కూడా అరిటాకు చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది కదా?కానీ ఏ ధైర్యంతో, ఎవరి భరోసాతో అందరూ పోటీలు పడి విమర్శలు చేస్తున్నారు?అనే సందేహం కలుగుతుంది.
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, టాలీవుడ్ పెద్దలు అందరూ ఆయనతో అంటకాగారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత సిఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వారు పెద్దగా పట్టించుకోలేదు!
నంది అవార్డులకు బదులు గద్దర్ అవార్డులు ఇస్తామని స్వయంగా ప్రతిపాదిస్తే టాలీవుడ్‌లో ఉలూకూపలుకూ లేదని సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.
ఇటీవల ఎన్ కన్వెన్షన్ కూల్చివేత టాలీవుడ్-తెలంగాణ ప్రభుత్వానికి మద్య ఉన్న దూరాన్ని మరింత పెంచి ఉండవచ్చు.
కానీ అది మాట్లాడే అంశం, సమయం కాదని అందరూ మౌనం వహించి ఉండవచ్చు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో టాలీవుడ్ అసహనం ఈరూపంలో బయటపడి ఉండవచ్చు.
టాలీవుడ్ ధైర్యానికి కారణం ఎవరు, ఏదైనప్పటికీ తొలిసారిగా అందరూ ముక్తకంఠంతో ఏకాభిప్రాయం చెప్పారు. కనుక మంత్రి కొండా సురేఖ నటి సమంతకు క్షమాపణలు చెప్పి వెనక్కు తగ్గారు.
కానీ ఆమెతో కేటీఆర్ యుద్ధం ఇంకా ఇప్పుడే ప్రారంభం అయ్యింది. ఆమె క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా, క్రిమినల్ కేసు వేస్తానని హెచ్చరించారు. కానీ ఆమె చెప్పలేదు. కనుక టాలీవుడ్ బ్యాక్ డ్రాప్‌లో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. కనుక ఇంకా ఇటువంటి అనేక వాదనలు, సంజాయిషీలు, తీర్మానాలు, తీర్పులు రోజూ వినిపిస్తూనే ఉంటాయి.




