విద్యా సంస్థలలో సినిమా ఈవెంట్స్.. దేనికి?

Students at Toxic pre-release event venue

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్‌ హీరోగా నటించిన టాక్సిక్ ‘ఏ ఫెయిరీ టేల్‌ ఫర్ గ్రోనప్స్’ అంటూ ముందే చెప్పేశారు. సినిమా టీజర్‌, ట్రైలర్‌, పాటలు అన్నీ ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. ‘ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే. కనుక తల్లితండ్రులు పిల్లలను థియేటర్లకు తీసుకు రావద్దని’ హీరో యష్‌ స్వయంగా చెపుతున్నారు.

అలాంటి ‘టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌ మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించడం, అందుకు యూనివర్సిటీ మేనేజిమెంట్ అనుమతించడం చాలా శోచనీయం. పైగా ‘విద్యార్ధుల బిహేవియర్ సరిగ్గా లేదని, ఇలా అయితే మళ్ళీ ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించబోమని’ మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి విద్యార్ధులను హెచ్చరించడం ఇంకా విచిత్రం.

ADVERTISEMENT

టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిన్న ప్రమాదం జరిగింది. సౌండ్ బాక్సుల కోసం పెట్టిన పెద్ద ఇనుప స్టాండ్ మీదకి విద్యార్ధులు ఎక్కినప్పుడు అది కూలిపోయి ఇద్దరు విద్యార్ధులు గాయపడ్డారు.

ఒకవేళ వారు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? యూనివర్సిటీ యాజమాన్యమా లేక టాక్సిక్ చిత్ర బృందమా లేక హీరో యషా?బహుశః అప్పుడీ ఘటన కూడా మరో సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుగా మిగిలిపోతుంది. అంతే!

టాక్సిక్ ఒక్కటే కాదు.. ఇప్పుడు చాలా సినిమా ఈవెంట్స్ కాలేజీలలోనే నిర్వహిస్తున్నారు. సినిమా ఈవెంట్స్ నిర్వహించుకోవడానికి అనేక వేదికలు, బహిరంగ మైదానాలు ఉన్నప్పుడు, పనిగట్టుకొని కాలేజీలు, యూనివర్సిటీలలో నిర్వహించడం దేనికి? చదువులకు పరిమితం కావాల్సిన కాలేజీలలో సినిమా ఈవెంట్స్ నిర్వహించేందుకు కాలేజీ యాజమాన్యాలు ఎందుకు అనుమతిస్తున్నాయి?

సినిమాలు తీస్తున్నవారు తమ సినిమా ప్రమోషన్లకు విద్యార్ధులను వాడుకోవాలనుకుంటే, కాలేజీ, యూనివర్సిటీ యాజమాన్యాలు వారికి ఈవిధంగా సహకరిస్తున్నాయి. విద్యాలయాలలో సినిమా ఈవెంట్స్ నిర్వహిస్తుంటే, ప్రభుత్వాలు వాటిని కట్టడి చేయకపోగా, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నాయి.

అంటే ప్రభుత్వాలకు కూడా ఇది తప్పుగా అనిపించడం లేదన్న మాట! మల్లారెడ్డి వంటి రాజకీయ నాయకులు విద్యాసంస్థలు, యూనివర్సిటీలను నడిపిస్తున్నందునే అని అనుకోవాలా? ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే తప్ప ఎవరూ మేల్కోరా?

ADVERTISEMENT
Latest Stories