తెలుగు, తమిళ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగి, ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తున్న చెన్నై సోయగం త్రిషకు ఏకంగా ముఖ్యమంత్రి కావాలని ఉందట. అయితే ఇది రియల్ గా కాదు, రీల్ పైన అని తాజాగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలను బయోపిక్ లు ఊపేస్తుండడంతో, తనకు కూడా ఒక బయోపిక్ లో నటించాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టింది.
తమిళనాడు ‘అమ్మ’ ముఖ్యమంత్రి జయలలిత జీవితచరిత్రతో సినిమా తీస్తే… ఆమె పాత్రలో నటించాలని ఉందంటూ ప్రకటన చేసింది. ధనుష్ తో నటించిన లేటెస్ట్ మూవీ “కోడి” సినిమా విడుదల ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సదరు సంగతులను చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. “ముఖ్యమంత్రి జయలలిత, తానూ చర్చ్ పార్క్ అనే స్కూల్ లో చదువుకున్నామని, ఆమె జీవితం స్పూర్తివంతంగా ఉంటుందని, ఆమె పాత్రలో నటించడం ద్వారా ముఖ్యమంత్రిగా కనిపించవచ్చని” తెలిపింది.
అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోనని చెప్పిన త్రిష, పరోక్షంగా దర్శకులకు హింట్ ఇచ్చింది. దీంతో జయలలిత జీవిత చరిత్రపై దృష్టి సారించాల్సిన పని దర్శకులపై పడింది. మొత్తానికి అవకాశాలు సృష్టించుకోవడంలో త్రిష చూపిస్తున్న చొరవ మరే ఇతర హీరోయిన్లకు రాలేదని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దం దాటినా టాప్ హీరోయిన్ గానే చెలామణి అవుతోంది.



