లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్. ఇప్పటికే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని క్యాబినెట్ ని కూడా సమకూర్చకుండా దేశవ్యాప్తంగా టూర్ చేస్తున్న ఆయన ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం నిర్మించాలని నిర్ణయించారు. కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలం కోసం ఈ రోజు పార్టీ ఎంపీలు దిల్లీలోని కొన్ని ప్రభుత్వ స్థలాలను పరిశీలించనున్నారు. దీనితో ఉన్నఫళంగా స్పెషల్ ఫ్లైట్ లో కేసీఆర్ వ్యక్తిగత వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ ను ఢిల్లీ కి రప్పించారు.
[m9ad]
ఎంపీలతో పాటు ఆయన కూడా స్థలాల పరిశీలనలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి సైతం ఈ రోజు మధ్యాహ్నం ఆయా స్థలాలను స్వయంగా పరిశీలించి, అనువైన స్థలం ఎంపిక చేసే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం తెరాస పార్టీకి దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి వెయ్యి గజాల ప్రభుత్వ స్థలం కేటాయించే అవకాశం ఉంది. ప్రభుత్వం కేటాయించే స్థలంలో తెరాస కార్యాలయం నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. సంక్రాంతి పండుగ తర్వాత డిల్లీలో కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని.. రెండు, మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
తద్వారా పార్లమెంట్ ఎన్నికల సమయానికి ఈ కార్యాలయం అందుబాటులో ఉండాలని కేసీఆర్ ప్రణాళికగా కనిపిస్తుంది. అయిదు రోజుల పర్యటనను పూర్తి చేసుకొని సీఎం కేసీఆర్ ఈరోజు రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. మరోవైపు క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో కేటీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి ఆశావహులు తెలంగాణ భవన్ కు క్యూ కడుతున్నారు. వచ్చే వారం రోజులలో ఎప్పుడైనా క్యాబినెట్ విస్తరణ ఉండవచ్చని సమాచారం. దీనితో ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.



