మంగళవారం రాత్రితో ఇరాన్ నాగరికత తుడిచిపెట్టేస్తానని చాలా అహంభావంతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, పాక్ మధ్యవర్తిత్వంతో వెనక్కు తగ్గారు. హోర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు మరో రెండు వారాలు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికాతో చర్చలకు ఇరాన్ కూడా సిద్ధపడినట్లు సమాచారం. కనుక ప్రస్తుతానికి యుద్ధం నిలిచింది. ఇరు దేశాల ప్రకటనతో చమురు ధరలు కాస్త దిగి వచ్చాయి. మళ్ళీ చాలా కాలం తర్వాత స్టాక్ మార్కెట్లు పుంజుకొని లాభాల బాట పట్టాయి.
ప్రస్తుతం పాక్ మధ్యవర్తిత్వంలో అమెరికా-ఇరాన్ మద్య చర్చలకు రంగం సిద్దమవుతోంది. కనుక ట్రంప్ గొంతెమ్మ కోర్కెలు కోరకుండా ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించేందుకు అంగీకరిస్తే శాంతి చర్చలు ఫలించే అవకాశం ఉంటుంది. కానీ బొత్తిగా మాట నిలకడలేని ట్రంప్‌కి ఏ క్షణంలో ఎలాంటి ఆలోచన వస్తుందో? ఏం నిర్ణయం తీసుకుంటారో ఎవరూ ఊహించలేరు. కనుక యుద్ధ భయం, యుద్ధ నష్టాలు ఇంకా పొంచి ఉన్నట్లే భావించవచ్చు.
అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న దుందుడుకు నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు తీరని నష్టం కలిగించారు. ఇప్పుడీ యుద్ధంతో ఇంకా తీరని నష్టం కలిగించారు. కానీ ట్రంప్ తీసుకున్న ప్రతీ నిర్ణయంతో ఆయన గౌరవం పెరుగకపోగా నవ్వులపాలవుతూనే ఉన్నారు. శత్రువులను పెంచుకుంటూనే ఉన్నారు.
కనుక ట్రంప్‌కి ఈ యుద్ధం నుంచి గౌరవ ప్రదమైన నిష్క్రమణ ఇప్పుడు చాలా అవసరం. కానీ గమ్మతైన విషయం ఏమిటంటే, గత ఏడాది భారత్ బారి నుంచి పాకిస్తాన్‌ని ట్రంప్ కాపాడితే, ఇప్పుడు అదే పాకిస్తాన్ ట్రంప్‌ని కాపాడాల్సి రావడం చాలా విడ్డూరంగా ఉంది కదా?
ఈ సమస్య నుంచి ట్రంప్‌ని బయటపడేస్తే ఆయన తప్పకుండా పాకిస్తాన్‌కి బిలియన్ డాలర్లు, అత్యాధునిక ఆయుధాలు బహుమతిగా అందిస్తారు. ట్రంప్ పరువుకి ఆ మాత్రం మూల్యం చెల్లించక తప్పదుగా!
ఏది ఏమైనప్పటికీ అటు ట్రంప్‌కి, ఇటు ఇరాన్‌కి, యావత్ ప్రపంచ దేశాలు తేరుకోవడానికి ఈ రెండు వారాల గడువు, యుద్ధం ముగింపు చాలా అవసరమే.






