అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించి ఇబ్బంది పెడుతున్నారు కనుక ఆయన మంచోడు కాడు. అని అనుకోవడం సహజమే.
కానీ ట్రంప్ కంటే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఏమైనా మంచోడా?అంటే కాదని ప్రతీ భారతీయుడికి తెలుసు. కనుక ట్రంప్ మీద కోపంతో జిన్ పింగ్‌తో చేతులు కలపడం వలన భారత్‌కు ఏమైనా మేలు జరుగుతుందా?అంటే కాదని ప్రధాని మోడీకి కూడా తెలుసు.
భారత్ నుంచి ‘చైనా మాల్’తో లక్షల కోట్లు పట్టుకుపోతున్న జిన్ పింగ్, భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్ క్షిపణులు, యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు అందించారు. ‘ఆపరేషన్ సింధూర్’తో ఈ విషయం బయటపడింది కదా?
భారత్‌కు వ్యతిరేకంగా చైనా-పాక్ మద్య ఎటువంటి సంబంధాలున్నాయో ప్రధాని మోడీతో సహా యావత్ ప్రపంచానికి తెలుసు. కాశ్మీర్ మీద పాకిస్తాన్ కన్నేస్తే, మన ఈశాన్య రాష్ట్రాలపై, బీహార్‌లో కొంత భాగంపై చైనా కన్నేసింది.
భారత్‌ని భౌగోళికంగా, ఆర్ధికంగా, పారిశ్రామికంగా కబళించాలని చూస్తున్న చైనాతో స్నేహం ఆపత్కాలంగా పనికివస్తుందేమో కానీ ఈ వ్యూహం పెద్దగా పని చేయదు. ఈ విషయం ప్రధాని మోడీకి, డోనాల్డ్ ట్రంప్ ఇద్దరికీ కూడా బాగా తెలుసు. ఇది గొప్ప ‘ఇంటర్నేషనల్ పొలిటికల్ పవర్ గేమ్’ అనిపించవచ్చు కానీ ఇది తాత్కాలిక కాలక్షేపం మాత్రమే. ఈలోగా ప్రతీరోజూ భారత్ వేలకోట్లు నష్టపోతూనే ఉంటుంది. కనుక భారత్‌కు ‘చైనా మాల్, చైనా వాల్’ రెండూ అవసరం లేదు.
ఇటువంటి క్లిష్ట సమయంలో భారత్ మరింత పదునైన వ్యూహంతో అమెరికాను ఎదుర్కొని ఈ సమస్య నుంచి గట్టెక్కాల్సి ఉంటుంది. కాదని చైనాని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అవుతుంది.





